మహారాష్ట్రలో అధికార పక్షానికి భారీ ఎదురుదెబ్బ తీగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. హర్యానా, మహరాష్ట్ర, కర్ణాటక, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 16 స్థానాలకు ఎన్నికలు జరగగా.. 8 స్థానాలను బీజేపీ దక్కించుకుంది. దీంతో రాష్ట్రపతి ఎన్నికల ముందు బీజేపీ పెద్దల సభలో తన బలాన్ని మరింతగా పెంచుకుంది.
ఇదిలా ఉంటే మహారాష్ట్రలోని రాజ్యసభ సభ్యుల ఎన్నిక అందర్ని ఆకర్షించింది. మహారాష్ట్రలో మొత్తం 6 స్థానాలకు ఎన్నికలు జరిగితే 3 స్థానాలను బీజేపీ గెలుచుకుంటే.. ఒక్కో స్థానాన్ని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు గెలుచుకున్నాయి. కాగా ఇక్కడ బీజేపీ మూడో సీటు గెలుచుకోవడానికి తగినంత బలం లేకున్నా.. అనూహ్యంగా మూడో సీటును కూడా గెలుచుకుని అధికార మహావికాస్ అఘాడీ కూటిమికి షాక్ ఇచ్చింది. బీజేపీతో విభేదించి కాంగ్రెస్, ఎన్సీపీతో జట్టు కట్టిన శివసేనకు బీజేపీ తన సత్తా చూపింది. అధికారంలో ఉన్నా కూడా శివసేన తన అభ్యర్థిని గెలిపించుకోలేక చతికిల పడింది.
మహారాష్ట్రలోె బీజేపీ తరుపున కేంద్ర మంత్రి పియూష్ గోయల్, అనిల్ బోండే, ధనంజయ్ మహాదిక్ పోటీ చేశారు. అయితే ధనంజయ్ మహాదిక్ గెలుపు పైనే అంతా ఫోకస్ పెట్టారు. బీజేపీ నుంచి ధనుంజయ్ మహాదిక్, శివసేన అభ్యర్థి సంజయ్ పవార్ పై విజయం సాధించారు. మొత్తం 284 ఓట్లలో పియూష్ గోయల్, అనిల్ బోండే కు 48 ఓట్లు రాగా.. మరో అభ్యర్థి విజయానికి 41 ఓట్లు అవసరం అయ్యాయి. అయితే ధనుంజయ్ మహాదిక్ 41.56 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన గెలుపొందారు. బీజేపీకి అనూహ్యంగా 10 ఓట్లు వచ్చాయి.
చాలా వరకు ఇండిపెండెంట్లు, కొన్ని పార్టీల ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేయడంతో పాటు జైల్లో ఉన్న నవాబ్ మాలిక్ ఓటేయడానికి కోర్టు అనుమతించకపోవడం శివసేన ఫలితాలను దెబ్బతీసినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ నుండి ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, ఎన్‌సిపి నుండి ప్రఫుల్ పటేల్ మరియు సేన నుండి సంజయ్ రౌత్ ఎన్నికల్లో గెలుపొందారు. ఇక్కడ విశేషం ఏమిటంటే అధికార శివసేన అభ్యర్థి సంజయ్ రౌత్ కన్నా మహాదిక్ ఎక్కువ ఓట్లు పొందారు. సంజయ్ రౌత్ కు 41 ఓట్లు వస్తే, మహాదిక్ కు 41.5 ఓట్లు వచ్చాయి.
