NTV Telugu Site icon

Delhi Liquor Policy Case: మరిన్ని చిక్కుల్లో ఆప్.. ఈడీ ఛార్జిషీట్‌లో తొలిసారి రాజకీయ పార్టీ పేరు..

Kejriwal

Kejriwal

Delhi Liquor Policy Case: దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ రాజకీయ పార్టీ పేరును దర్యాప్తు సంస్థ ఛార్జిషీటులో పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తొలిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని నిందితుడిగా పేర్కొంది. శుక్రవారం రోస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌లో ఆప్ పేరును ప్రస్తావించింది. లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై మనీలాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. మార్చి నెలలో ఆయను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. జూన్ 2న లొంగిపోవాలని చెప్పింది.

Read Also: Jaishankar: ‘‘పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.’’ .. పాకిస్తాన్‌కి జైశంకర్ వార్నింగ్..

ఈ కుంభకోణంలో తాజాగా దాఖలైన ఛార్జిషీట్ 8వది కాగా, ఢిల్లీ సీఎం పేరు ఉన్న మొదటి ఛార్జిషీట్. ఈ కేసులో మరో ఇద్దరు ఆప్ నేతలు మనీష్ సిసోడియా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌పై కూడా అభియోగాలు ఉన్నాయి. అయితే ఆప్‌ని నిందితుడి పేర్కొనడం పార్టీకి పెను పరిణామాలు కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఈడీ ఎన్నికల సంఘానికి లేఖ రాసే అవకాశం ఉంది. అదే జరిగితే ఆప్ గుర్తింపు రద్దు కావచ్చు. ఈ పార్టీ గుర్తింపును రద్దు చేసే ప్రక్రియ ప్రారంభించాల్సిందిగా ఈడీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరే అవకాశం ఉంది.

మరోవైపు రాజ్యసభ ఎంపీ, ఆప్ నేత స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ దాడి చేయడం ప్రస్తుతం రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బిభవ్ కుమార్ తనను 7 సార్లు చెంపపై కొట్టారని, అంతే కాకుండా కడుపు, ఇతర సున్నిత భాగాలపై కాలితో తన్నినట్లు ఆమె ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. ఈ వ్యవహారంపై ఈ రోజు ఢిల్లీ పోలీసులు, ఫోరెన్సిక్ టీం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లింది. సీన్ క్రియేషన్ కోసం స్వాతి మలివాల్‌ని అక్కడకు తీసుకెళ్లారు.