IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు

  • తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలకు వర్ష సూచన
  • భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక
Rain

Rain

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వాతావరణం మారనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఐఎండీ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బీహార్, ఒడిశా, బెంగాల్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో దేశ రాజధాని, పరిసర ప్రాంతాలు మేఘావృతమై ఉండవచ్చని తెలిపింది.

రేపు ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐఎండీ అంచనా ప్రకారం.. రేపు తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షం కురిసే అవకాశం ఉండగా.. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని వెల్లడించింది. ఇదిలా ఉండగా బీహార్‌లో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రేపు కూడా బీహార్‌లోని చాలా ప్రాంతాల్లో వర్షం పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచవచ్చని హెచ్చరించింది.

బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల దగ్గర సెప్టెంబర్ 11న మరో కొత్త అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. దీని ఫలితంగా సెప్టెంబర్ 12 నుంచి తూర్పు రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మళ్లీ ప్రారంభం అవుతాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, అండమాన్-నికోబార్ దీవులు, అస్సాం, మేఘాలయలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, గోవా, గుజరాత్, మహారాష్ట్ర, మరఠ్వాడా, కేరళ, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటకలో మాత్రం తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.