దేశ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన INSAT-3DR, INSAT-3DS ఉపగ్రహాలు తాజాగా విడుదల చేసిన చిత్రాల్లో దేశంలో సుమారు 70 శాతం ప్రాంతం మేఘావృతమైందని వెల్లడించాయి. అయితే ఇది కేవలం మేఘాలు ఎక్కువగా ఉండటమే కాకుండా.. వాటి ఎత్తు, తీవ్రత కూడా పెరిగినట్లు ఉపగ్రహ డేటా వెల్లడించింది. దీంతో రానున్న రోజుల్లో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
జూలై 21న ఉదయం 10.45 గంటల నుంచి 11.27 గంటల మధ్య ఇస్రో ఉపగ్రహాలు సేకరించిన డేటాను ఢిల్లీలోని భారత వాతావరణ శాఖ విశ్లేషించింది. ఈ విశ్లేషణలో బంగాళాఖాతం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో Cloud Top Brightness Temperature (CTBT) విలువలు మైనస్ 60 నుంచి మైనస్ 80 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవడం అంటే మేఘాలు భూమికి 12 నుంచి 16 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించాయని.. తీవ్రమైన ఉరుములు, మెరుపులు, భారీ వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉంది?
గత వారం రోజులుగా ఢిల్లీపై రుతుపవనాల ప్రభావం తక్కువగా ఉండగా.. ప్రస్తుతం బంగాళాఖాతం నుంచి తేమగాలులు చేరడంతో మాన్సూన్ ట్రఫ్ మళ్లీ చురుకుగా మారింది. మంగళవారం ఉదయం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. దీంతో గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. ఢిల్లీకి భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ జల్లులు, ఉరుములు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
నీటి ఆవిరి చిత్రాలు ఏమి చెబుతున్నాయి?
INSAT-3DS ఉపగ్రహంలోని 6.88 మైక్రోమీటర్ల వాటర్ వేపర్ ఛానల్ ద్వారా తీసిన చిత్రాలు ఉత్తర, మధ్య భారతదేశం, బంగాళాఖాతంపై భారీగా తేమగాలులు ఉన్నట్లు చూపిస్తున్నాయి. ఇవే దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో భారీ వర్ష మేఘాలకు ఇంధనంగా పనిచేస్తున్నాయి. అదే సమయంలో అరేబియా ద్వీపకల్పం, పశ్చిమ పాకిస్థాన్ ప్రాంతాల్లో పొడి గాలులు ఉన్నట్లు ఉపగ్రహాలు గుర్తించాయి. ప్రస్తుతం రుతుపవనాలకు అక్కడి నుంచి ఎలాంటి అంతరాయం లేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. మరో 4 నుంచి 5 రోజుల పాటు వాయువ్య, ఈశాన్య భారతదేశంలో రుతుపవనాలు చురుకుగానే కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. గంట గంటకు మేఘాల విస్తీర్ణం మారవచ్చు. అయితే వాటి తీవ్రత మాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదని ఇస్రో ఉపగ్రహాల తాజా విశ్లేషణ స్పష్టం చేస్తోంది.
CTBT అంటే ఏమిటి?
ఉపగ్రహాలు మేఘాలను నేరుగా తాకి ఉష్ణోగ్రతను కొలవవు. అవి మేఘాల నుంచి వెలువడే ఇన్‌ఫ్రారెడ్ కిరణాలను విశ్లేషించి వాటి ఉష్ణోగ్రతను అంచనా వేస్తాయి. దీనినే Cloud Top Brightness Temperature (CTBT) అంటారు. వాతావరణంలో ఎత్తుకు వెళ్లే కొద్దీ ప్రతి కిలోమీటరుకు సుమారు 6.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. అందువల్ల CTBT విలువ ఎంత తక్కువగా ఉంటే.. మేఘాలు అంత ఎత్తుకు ఎదిగినట్లుగా భావిస్తారు. ఇవే తీవ్రమైన ఉరుములు, మెరుపులు, భారీ వర్షాలకు కారణమవుతాయి.

