IIT Baba: మహా కుంభమేళాలో అందరి దృష్టిని ఆకర్షించిన ‘‘ఐఐటీ బాబా’’ గురించి అందరికి తెలిసిందే. అభయ్ సింగ్ అనే ఐఐటియన్ బాబాగా మారడంపై మీడియా ప్రత్యేక కథనాలను కూడా ప్రచురించింది. ఇటీవల, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలుస్తుందని జోస్యం చెప్పడంతో మరోసారి ఈ బాబా వైరల్ అయ్యారు. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ చిరకాల ప్రత్యర్థిని చిత్తుగా ఓడించడంతో, ఐఐటీ బాబాపై ట్రోల్స్ వచ్చాయి.
Read Also: Trump-Zelenskyy meet: రసాభాసగా ట్రంప్-జెలెన్స్కీ మీటింగ్.. తలపట్టుకున్న ఉక్రెయిన్ రాయబారి..
ఇదిలా ఉంటే, తనపై దాడి జరిగినట్లు అభయ్ సింగ్ ఆరోపణలు చేశారు. శుక్రవారం నోయిడాలోని ఒక ప్రైవేట్ ఛానెల్‌లో చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో దాడి జరిగినట్లు చెప్పారు. కొంతమంది కాషాయ దుస్తులు ధరించిన వ్యక్తులు న్యూస్ రూమ్‌లోకి వచ్చి తనతో అసభ్యంగా ప్రవర్తించారని, కర్రలతో కొట్టారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సెక్టార్ 126లో నిరసనకు కూర్చొన్నారు. చివరకు పోలీసులు ఒప్పించడంతో నిరసన విరమించుకున్నారు. ఈ ఘటనపై ఆయన ఇంకా ఫిర్యాదు చేయలేదని సెక్టార్ 126 పోలీస్ స్టేషన్‌లోని ఎస్‌హెచ్‌ఓ భూపేంద్ర సింగ్ చెప్పారు.