AAP: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విపక్షాల ఐక్యత గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడకుంటే.. తర్వాత భారతదేశంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండదని ఆప్ గురువారం ఆరోపించింది. 2024లో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధానిగా ఎన్నికైతే రాజ్యాంగాన్ని మార్చి దేశానికి ‘రాజు’గా ప్రకటించుకునే అవకాశం ఉందని ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు. మోడీ బతికున్నంత వరకు ఆయనే దేశానికి ప్రధానిగా ఉండేలా రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉందని అన్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా మాట్లాడుతూ.. సౌరభ్ వ్యాఖ్యలు మూర్ఖంగా ఉన్నాయని అన్నారు.
Read Also: Slow Aging: మరో మైలురాయి.. యవ్వనాన్ని పెంచే సూత్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
జూన్ 23న పాట్నాలో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో ప్రతిపక్షాల సమావేశం జరగనుంది. ఈ క్రమంలో ఆప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రతిపక్ష పార్టీలు ఈ సారి ఏకతాటిపైకి రాకుంటే ఇదే జరిగే అవకాశం ఉందని, బీజేపీ ప్రతిపక్ష పార్టీలను తొక్కేస్తుందని ఆయన అన్నారు. ప్రత్యర్థి పార్టీల నేతలపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు నిర్వహించి వారిని జైళ్లలోకి నెట్టేస్తోందని, 2024లో నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని అయితే.. రాజ్యాంగాన్ని మార్చేసి శాశ్వతంగా ప్రధాని అవుతారని ఆప్ నేత ఆరోపించారు.
ఇదిలా ఉంటే జూన్ 23న బీహార్ ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న ప్రతిపక్షాల సమావేశంలో 2024 లోక్ సభ ఎన్నికలకు వ్యూహరచన చేయనున్నారు. ఈ సమావేశానికి అన్ని కాంగ్రెస్ తో పాటు ఎన్సీపీ, శివసేన, ఆప్ వంటి ప్రధాన పార్టీలు హాజరుకానున్నాయి. ఇదిలా ఉంటే ఆప్ వ్యాఖ్యలను బీజేపీ కొట్టి పారేసింది. కేజ్రీవాల్ ని అవినీతిపరుడని ఆరోపించిన పార్టీలతో కూడా ఆప్ జట్టుకడుతోందని ఆరోపించింది.
