NTV Telugu Site icon

Karnataka CM Basavaraj Bommai: అవసరమైతే కర్ణాటకలో ‘యోగి మోడల్’ సర్కారు..

Karnataka Cm Basavaraj Bommai

Karnataka Cm Basavaraj Bommai

Karnataka CM Basavaraj Bommai: కర్ణాటకలో ఓ బీజేపీ కార్యకర్త హత్య విషయంపై పార్టీలోనూ, బయటా నెలకొన్న ఒత్తిళ్ల నేపథ్యంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కర్ణాటకలో పరిస్థితులకు అనుగుణంగా తాము వ్యవహరిస్తున్నామని.. ఒకవేళ పరిస్థితులుగానీ మారితే పరిస్థితులు డిమాండ్‌ చేస్తే కర్ణాటకలో కూడా ‘యోగి మోడల్‌’ ప్రభుత్వం అమలులోకి వస్తుందని వ్యాఖ్యానించారు. శాంతిభద్రతలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న దేశ వ్యతిరేక, మతతత్వ శక్తులను నియంత్రించేందుకు ఉత్తరప్రదేశ్ తరహాలో పాలన అమలు చేస్తామని హెచ్చరించారు.

ఇటీవల దక్షిణ కన్నడ జిల్లాలో బీజేపీ యువజన విభాగం నేత ప్రవీణ్‌ నెట్టారు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య పార్టీలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. రాష్ట్ర ప్రభుత్వం తమను రక్షించలేకపోయిందని నిన్న యువ సభ్యులు సామూహిక రాజీనామా యాత్రను నిర్వహించారు. కేవలం ఏడాది పూర్తి చేసుకున్న బొమ్మై ప్రభుత్వం హిందూ కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించడం లేదని బీజేపీ, సంఘ్ పరివార్ మద్దతుదారులు ఆరోపించారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు, హిందూత్వ వాదుల ప్రాణాలు కాపాడుకొనేందుకు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బసవరాజ్ బొమ్మై కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, దక్షిణ కన్నడ జిల్లాలో బీజేవైఎం నేత ప్రవీణ్‌ హత్య కేసును సీరియస్‌గా తీసుకున్నామని.. ఐదు బృందాలను ఏర్పాటు చేసి కేరళకు పంపినట్టు తెలిపారు. ఈ కేసులో అధికారులు తీవ్రంగా కృషిచేస్తున్నారన్నారు. నేరస్థుల్ని త్వరలోనే అరెస్టు చేసి శిక్షిస్తామన్న విశ్వాసాన్ని సీఎం వ్యక్తంచేశారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో తాము రాజీపడబోమని.. దేశ వ్యతిరేక, మతతత్వశక్తుల వ్యవస్థీకృత నేరాలపై యుద్ధం ప్రకటించామన్నారు. వాటి ఫలితాలు ప్రజలకు తెలుస్తాయని.. అందరూ సంయమనంతో ఉండాలని బొమ్మై విజ్ఞప్తి చేశారు.

బొమ్మై నేతృత్వంలోని కర్ణాటక బీజేపీ ప్రభుత్వం గురువారంతో ఏడాది పూర్తి చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితిని పరిశీలిస్తే, రాష్ట్రాన్ని నిర్వహించడానికి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ సరైన వ్యక్తి అని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. కర్ణాటకలో మతతత్వ శక్తులను ఎదుర్కోవటానికి వివిధ పద్ధతులను అనుసరిస్తున్నామని.. కానీ, పరిస్థితులు డిమాండ్‌ చేస్తే కర్ణాటకలోనూ ‘యోగి మోడల్‌’ ప్రభుత్వమే వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ చర్యలు వివాదాస్పదంగా మారినా కూడా.. కర్ణాటకలోనూ అలాంటి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీజేపీ వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బొమ్మై వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.