UP: ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా ‘‘ఐ లవ్ ముహమ్మద్’’ పోస్టర్‌పై ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. శుక్రవారం ప్రార్థనల అనంతరం బరేలీలో నిరసనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. సెప్టెంబర్ 4న ‘ఐ లవ్ ముహమ్మద్’ పోస్టర్‌తో ఉన్న టెంట్‌ను పోలీసులు తొలగించిన తర్వాత కాన్పూర్‌లో ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై ఒక మతపెద్ద మెమోరాండం సమర్పించాలని ఇచ్చిన పిలుపుకు ప్రతిస్పందనగా శుక్రవారం ప్రార్థనల తర్వాత బరేలీలోని ఇస్లామియా మైదానం సమీపంలో భారీగా జనాలు గుమిగూడారు.
ఈ సమయంలో గుంపులో కొంత మంది అసభ్యకరమైన నినాదాలు చేయడంతో పాటు కొంత మంది నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితిని నియంత్రించడానికి పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. అధికారులు ప్రస్తుతం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అల్లర్లకు సంబంధించి కఠినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారుల్ని ఆదేశించింది.
Read Also: Acerpure Nitro Gaming TV: బడ్జెట్ ధరలో.. ఏసర్ నుంచి అధునాతన ఫీచర్లతో గేమింగ్ స్మార్ట్ టీవీ విడుదల..
గొడవ ఎలా మొదలైంది..?
సెప్టెంబర్ 4న కాన్పూర్‌లో ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ ఊరేగింపు సందర్భంగా ‘ఐ లవ్ ముహమ్మద్’ పోస్టర్‌ను ఒక టెంట్‌పై ఉంచారు. స్థానిక హిందూ సంఘాలు బోర్డును వ్యతిరేకించాయి. హిందూ,ముస్లిం జనాభా ఉండే ప్రాంతాల్లో, రామనవమి వంటి హిందూ పండగలు జరిగే ప్రాంతంలో దీనిని ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసినట్లు వాదించారు. దీంతో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసుకోవడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. కాన్పూర్ పోలీసులు సెప్టెంబర్ 09న టెంట్‌ని తొలగించారు. దీనిని ఏర్పాటు చేసిన 24 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ముస్లింలపై కేసులు నమోదు చేయడం వివక్ష అంటూ పలువురు మతపెద్దలు ఈ వారం పోలీసులపై ఆరోపణలు చేశారు.
గురువారం మైనారిటీ కమ్యూనిటీ సభ్యులు అనేక దుకాణాలను, వాహనాలను ధ్వంసం చేశారు. గుజరాత్ గాంధీనగర్ జిల్లాలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. మంగళవారం రాత్రి కర్ణాటక దావణగెరెలో ‘ఐ లవ్ ముహమ్మద్’’ పోస్టర్లు వెలిశాయి. ఇది ఇరు వర్గాల రాళ్ల దాడికి కారణమైంది. యూపీలోని ఉన్నావ్, మహారాజ్‌గంజ్, లక్నో, కౌశాంబిలో కూడా అశాంతి చెలరేగింది.
