Site icon NTV Telugu

Yana Mir: “నేను మలాలా‌ని కాదు, నా దేశంలో సురక్షితంగా ఉన్నా”.. కాశ్మీరీ యువతి ప్రసంగం వైరల్..

Yana Mir

Yana Mir

Yana Mir: భారత్‌లో జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో మైనారిటీలను అణిచివేస్తున్నారని, ఇండియన్ ఆర్మీ దురాగతాలకు పాల్పడుతోందని వెస్ట్రన్ మీడియాతో పాటు పాకిస్తాన్ ప్రేలాపనలను కాశ్మీరీ యువతి, హక్కుల కార్యకర్త యానా మీర్ కొట్టిపారేసింది. తప్పుడు ప్రచారాలు చేస్తున్న ‘‘టూల్‌కిట్ ఫారిన్ మాడియా’’పై ఆమె విరుచుకుపడింది. బ్రిటన్ పార్లమెంట్‌లో ఆమె చేసిన ప్రసంగం ఇప్పుడు వైరల్‌గా మారింది.

‘‘నేను మలాలా యూసఫ్‌జాయ్‌ని కాదు. ఎందుకంటే నేను ఎప్పటికీ నా స్వదేశం నుంచి పారిపోవాల్సిన అవసరం రాలేదు.’’ అని బ్రిటన్ వేదికగా ఆమె గళమెత్తారు. ‘‘ నేను స్వేచ్ఛగా నా దేశం భారతదేశంలో భాగమైన జమ్మూ కాశ్మీర్‌లో సురక్షితంగా ఉన్నాను’’ అంటూ యానా మీర్ అన్నారు. యానా మీర్‌ని తొలి కాశ్మీరీ మహిళా వ్లాగర్‌గా పిలుస్తారు.

బాలికల విద్యపై తాలిబాన్ నిషేధాన్ని ధిక్కరించినందుకు 2012లో పాకిస్తాన్‌లోని స్వాత్ లోయలో మాలాలా యూసఫ్ జాయ్‌ని కాల్చారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ.. ఆమె బతికింది. ఆ తర్వాత మలాలా యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లి, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేరారు, చివరికి 2014లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న అతి పిన్న వయస్కురాలు మలాలా రికార్డ్ సృష్టించింది. ఈ అవార్డు అందుకునే సమయానికి ఆమెకు 17 ఏళ్లు.

Read Also: Rahul Gandhi: అమిత్ షాపై వ్యాఖ్యల కేసులో రాహుల్‌కి చుక్కెదురు

అయితే, మలాలా యూసఫ్‌‌జాయ్ తన దేశాన్ని(భారత్)ని అణిచివేతగా పేర్కొంటూ పరువు తీయడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు యానా మీర్ అన్నారు. కాశ్మీర్‌ని ఎప్పుడూ సందర్శించకుండా.. సోషల్ మీడియాలో, విదేశీ మీడియాలో తప్పుడు కథనాలు వ్యక్తపరుస్తున్న ‘టూల్ కిట్ సభ్యుల’ను తాను వ్యతిరేకిస్తున్నట్లు యానా మీర్ అన్నారు. మత ప్రాతిపదికన భారతీయులను విడగొట్టడం మానేయాలని, మమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి అనుమతించనని, ఇప్పటికైనా పాకిస్తాన్, యూకేలో నివాసం ఉంటున్న వారు ఇలాంటి కథనాలను మానేస్తారని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

జమ్మూ మరియు కాశ్మీర్ యూత్ సొసైటీతో అనుబంధం కలిగి ఉన్న యానా మీర్, బ్రిటిష్ పార్లమెంట్ భవనంలో జమ్మూ అండ్ కాశ్మీర్ స్టడీ సెంటర్ UK (JKSC) నిర్వహించిన “సంకల్ప్ దివస్” కార్యక్రమంలో ప్రసంగించారు. ప్రస్తుతం ఆమె యూకే పార్లమెంట్ వేదికగా ఆవేశంగా చేసిన ప్రసంగం వైరల్ అయింది. నాన్నను పోగొట్టుకుని డిప్రెషన్‌లో ఉన్న నన్ను ఇక్కడికి వెళ్లేలా చేసిన కశ్మీర్ బీజేపీ మీడియా ఇన్‌చార్జి సాజిద్ యూసుఫ్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని ఆమె వివరించారు.

Exit mobile version