Site icon NTV Telugu

Rahul Gandhi: నేను సామాన్యుడిని.. నేను ఎంపీని కాదు..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: రాహుల్ గాంధీ మూడు రోజుల పర్యటన కోసం మంగళవారం అమెరికా చేరుకున్నారు. ఆయనకు కాంగ్రెస్ ఎన్నారై శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అమెరికాలోని మూడు నగరాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రవాస భారతీయులతో, అమెరిక్ చట్టసభ సభ్యులతో సమావేశం కానున్నారు. మంగళవారం శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్న రాహుల్ గాంధీకి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్‌పర్సన్ శామ్ పిట్రోడా, ఐఓసీ ఇతర సభ్యులు స్వాగతం పలికారు. ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ కోసం రాహుల్ గాంధీ విమానాశ్రయంలో రెండు గంటలపాటు వేచి ఉండాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Read Also: Pakistan: పాకిస్తాన్‌లో తీవ్రమైన ఆహార సంక్షోభం.. యూఎన్ నివేదిక..

ఇమ్మిగ్రేషన్ సందర్భంగా రాహుల్ గాంధీ క్యూలో నిల్చోని ఉండగా.. పలువురు ప్రయాణికులు అతనితో సెల్పీలు తీసుకున్నారు. క్యూలో ఎందుకు నిలుచున్నారని.. అక్కడి ప్రయాణికులు ప్రశ్నించారు. దీనికి రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘‘నేను సామాన్యుడిని.. ఇది నాకు ఇష్టం.. ఇక ఎంపీని కాదు’’ అని సమాధానం ఇచ్చారు. ప్రతిష్టాత్మక స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో రాహుల్ గాంధీ ముచ్చటించనున్నారు. ఆ తరువాత వాషింగ్టన్ లోని చట్ట సభ సభ్యులతో సమావేశం కానున్నారు.

శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ నగరాల్లో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. జూన్ 4న న్యూయార్క్‌లో బహిరంగ సభతో తన పర్యటనను ముగించబోతున్నాడు. రాహుల్ గాంధీ నిజమైన ప్రజాస్వామ్యం దృక్పథాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పర్యటన ఉందని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్‌పర్సన్ శామ్ పిట్రోడా అన్నారు. ఢిల్లీ కోర్టు క్లియరెన్స్ ఇచ్చిన రెండు రోజుల తర్వాత రాహుల్ గాంధీకి ఆదివారం కొత్త సాధారణ పాస్‌పోర్ట్ లభించింది. ఎంపీగా అనర్హత వేటు పడటంతో ఆయన డిప్లామాటిక్ పాస్ పోర్టు సరెండర్ చేసి సాధారణ పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

Exit mobile version