హైదరాబాదీలకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గుడ్‌న్యూస్ చెప్పారు. హైదరాబాద్‌ను దేశంలో కీలక హైస్పీడ్ రైలు (బుల్లెట్ ట్రైన్) హబ్‌గా అభివృద్ధి చేయనున్నట్లు అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. హైదరాబాద్‌ను పుణే, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించే మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలను అనుసంధానించి తెలంగాణ అభివృద్ధికి కొత్త ఊపు తీసుకొస్తాయని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన HYSEA GCCS & IT రౌండ్‌టేబుల్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి.. ప్రధాని మోడీ తెలంగాణ రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి రికార్డు స్థాయిలో రూ.5,400 కోట్ల బడ్జెట్ కేటాయించారని వెల్లడించారు.
మార్గాలివే..
హైదరాబాద్ కేంద్రంగా మూడు హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రతిపాదించినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. పూణె – హైదరాబాద్, హైదరాబాద్ – చెన్నై, హైదరాబాద్ – బెంగళూరు ఈ మూడు మార్గాలు అమల్లోకి వస్తే హైదరాబాద్ దక్షిణ భారతదేశంలో ప్రధాన హైస్పీడ్ రైలు కేంద్రంగా మారుతుందని.. ఆయా ప్రాంతాల ఆర్థిక వ్యవస్థలు పరస్పరం మరింత అనుసంధానమవుతాయని పేర్కొన్నారు. తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.5,400 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఈ నిధులతో రాష్ట్రంలో రైల్వే రంగంలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ తయారీ ప్రోత్సాహక పథకాల వల్ల తెలంగాణకు విశేష ప్రయోజనం చేకూరిందన్నారు. ఇప్పటివరకు 100కు పైగా ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలు కేంద్ర పథకాల కింద ప్రోత్సాహం పొందాయని వివరించారు.
దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కార్యక్రమం వేగంగా కొనసాగుతోందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇప్పటివరకు 261 రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణం పూర్తయిందని చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి 400 స్టేషన్లు, వచ్చే ఏడాది చివరి నాటికి 700 స్టేషన్ల ఆధునీకరణ పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా కొనసాగుతున్నాయని తెలిపారు. అన్ని ప్లాట్‌ఫారమ్‌లపై భారీ ఎయిర్ కాన్‌కోర్స్ (Air Concourse) నిర్మిస్తున్నామని, రైళ్లు నడుస్తూనే అత్యంత జాగ్రత్తగా ఈ పనులు చేపడుతున్నామని చెప్పారు. భద్రత, నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.
బేగంపేట్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పూర్తయిందని.. త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. అలాగే హైటెక్ సిటీ, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్ల పనులు కూడా పూర్తయ్యాయని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ (నాంపల్లి), కాజీపేట్ జంక్షన్, మలక్‌పేట్ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. స్వాతంత్ర్యం తర్వాత రైల్వే స్టేషన్లలో కేవలం పెయింటింగ్‌లు, చిన్నపాటి మరమ్మతులకే పరిమితమయ్యారని, కానీ ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 1,300 రైల్వే స్టేషన్లను పూర్తిగా పునర్నిర్మించే లక్ష్యాన్ని చేపట్టారని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం భారత రైల్వే చరిత్రలో అతిపెద్ద ఆధునీకరణ ప్రాజెక్టుగా నిలుస్తుందని అన్నారు.

