NTV Telugu Site icon

Ram Mandir: శ్రీరాముడి కోసం బంగారు పాదరక్షలు.. 8 వేల కి.మీ పాదయాత్ర చేస్తున్న హైదరాబాద్ వ్యక్తి..

Ram Mandir

Ram Mandir

Ram Mandir: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దేశవ్యాప్తంగా కన్నుల పండగగా సాగే ఈ మహత్తర ఘట్టం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. జనవరి 22న భవ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహం ప్రతిష్టాపన జరగబోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తగా 7000 మంది అతిథులను ఆలయ ట్రస్ట్ ఆహ్వానించింది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు, కీలక రాజకీయ నాయకులు, ఫిలిం స్టార్లు, స్పోర్ట్స్ స్టార్స్‌లతో పాటు సాధువులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

ఇదిలా ఉంటే రామమందిరం కోసం హైదరాబాద్ వ్యక్తి ఏకంగా 8000 పాదయాత్ర చేస్తున్నారు. రాముడి కోసం బంగారు చెప్పులను అయోధ్యకు తీసుకెళ్తున్నారు. రూ. 65 లక్షల విలువ చేసే బంగారు పూత కలిగిన పాదరక్షలను తీసుకుని అయోధ్యకు కాలినడకతో యాత్ర చేపట్టారు. హైదరాబాద్‌కు చెందిన 64 ఏళ్ల చల్లా శ్రీనివాస్ శాస్త్రి చేపట్టిన పాదయాత్ర జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవం వరకు సాగనుంది.

శ్రీరాముడికి బంగారు కానుకని అందించాలని శ్రీరాముడు వనవాసానికి వెళ్లిన మార్గంలో రివర్స్ దిశలో ఆయన రామేశ్వరం నుంచి అయోధ్యకు బయలుదేరారు. గతంలో రామాలయానికి 5 వెండి ఇటుకలను విరాళంగా ఇచ్చారు. జూలై 20న శాస్త్రి తన పాదయాత్రను ప్రారంభించారు. అయితే ఆయన యూకే పర్యటనకు వెళ్లా్ల్సి రావడంతో కొన్ని రోజులు యాత్రకు గ్యాప్ ఇచ్చారు. మళ్లీ రామేశ్వరం నుంచి యాత్రను పున: ప్రారంభించారు.

Read Also: Bangladesh: తీవ్ర ఉద్రిక్తతల మధ్య రేపు బంగ్లాదేశ్‌ ఎన్నికలు..నాలుగోసారి ప్రధానిగా షేక్ హసీనా..!

యాత్రలో రాముడు స్థాపించినట్లు చెప్పబడే శివ లింగాలు ఉ్నన ప్రాంతాల్లో ఆగారు. ఒడిశాలోని పూరీ, మహారాష్ట్రలోని త్రయంబక్ మరియు గుజరాత్‌లోని ద్వారక వంటి ముఖ్యమైన ప్రదేశాలను కవర్ చేసిన శాస్త్రి రాబోయే 10 రోజుల్లో అయోధ్యకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తన తలపై రాముడి విగ్రహం కోసం పంచధాతు(ఐదులోహాల)తో తయారు చేసిన బంగారుపూత పూసిన పాదరక్షలను మోస్తూ అయోధ్య వెళ్తున్నారు. అయోధ్య చేరుకున్న తర్వాత వీటిని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి అందించాలని భావిస్తున్నారు.

‘‘మా నాన్న అయోధ్య కరసేవలో పాల్గొన్నారు. అతను హనుమంతుడి భక్తుడు. అయోధ్యలో రామమందిరం నిర్మించాలనేది అతని కోరిక. ఆయన లేకున్నా, నేను మా తండ్రి కోరికను తీర్చాలని నిర్ణయించుకున్నాను’’ అని శాస్త్రి చెప్పారు. అయోధ్య భాగ్యనగర్ సీతారామ ఫౌండేషన్ వ్యవస్థాపకుడిగా, శాస్త్రి అయోధ్యలో శాశ్వతంగా స్థిరపడాలని యోచిస్తున్నారు, పవిత్ర నగరంలో ఇల్లు నిర్మించుకోవాలని అనుకుంటున్నారు.