Site icon NTV Telugu

Delhi High Court: భార్య ఇంటి పనులు చేయాలని భర్త ఆదేశించడాన్ని క్రూరత్వం అనలేం..

Law News

Law News

Delhi High Court: భర్తను తన కుటుంబం నుంచి విడిగా జీవించాలని భార్య కోరడం క్రూరత్వానికి సమానమే అని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. వివాహం అనేది భవిష్యత్తు జీవితంతలో బాధ్యతలను పంచుకోవడమే అని, తన భార్య ఇంటి పనులు చేయాలని భర్త ఆదేశించడాన్ని క్రూరత్వంగా పేర్కొనలేమని కోర్టు చెప్పింది. పెళ్లయిన స్త్రీని ఇంటి పని చేయమని కోరడం పనిలో సహాయం చేసినట్లు కాదని, ఇది ఆ కుటుంబం పట్ల ఆమెకున్న ప్రేమ, ఆప్యాయతగా పరిగణించబడుతుందని చెప్పింది. తన భార్య క్రూరత్వం కారణంగా తన వివాహాన్ని రద్దు చేయడానికి నిరాకరించిన ఫ్యామిలీ కోర్టు ఆర్డర్‌ని ఓ వ్యక్తి అప్పీల్ చేసిన సందర్భంలో హైకోర్టు ఈ వ్యాఖ్యల్ని చేసింది.

అప్పీల్ దాఖలు చేసిన భర్త.. తన భార్య ఇంటిపనుల్లో సహకరించకపోవడం, అత్తింటి నుంచి వెళ్లిపోవడం, తనపై క్రిమినల్ తప్పుడు క్రిమినల్ కేసులు పెట్టడం వల్ల తాను బాధపడ్డానని చెప్పారు. తన భార్య, తన కుటుంబం నుంచి విడిగా ఉండాలని పట్టుబట్టేదని అతను ఆరోపించాడు. వృద్ధాప్యంలో ఎలాంటి ఆదాయపనులు లేదా తక్కువ ఆదాయ వనరులు ఉన్న తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిన నైతిక బాధ్యత కుమారుడికి ఉందని, వివాహం తర్వాత హిందూ కుటుంబంలో కొడుకు విడిపోవడం అనేది వాంఛనీయ సంస్కృతి కాదని జస్టిస్ సురేష్ కుమార్ కైత్, నీనా బస్సన్ కృష్ణలతో నేతృ‌త్వంలోని ధర్మాసనం పేర్కొంది.

Read Also: Scotland: అక్కడ డాక్టర్లు, టీచర్ల కొరత.. వారి జీతం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

నరేంద్ర vs కే.మీనా కేసులో కొడుకును తన కుటుంబం నుంచి వేరు కావాలని కోరడం క్రూరత్వమే అని సుప్రీంకోర్టు తీర్పును ఈ కేసులో ప్రస్తావించారు. భారతదేశంలో ఒక హిందూ కుటుంబంలో వివాహం తర్వాత విడిపోవడం అనేది సాధారణ పద్ధతి కాదని ధర్మాసనత తన ఉత్తర్వుల్లో పేర్కొంది. వివాహం అనేది భవిష్యత్తులో బాధ్యతలను పంచుకోవడమని, వివాహిత స్త్రీని ఇంటి పనిచేయమని కోరడం పనిమనిషితో పోల్చడం కాదని చెప్పింది. కొన్ని విభాగాల్లో భర్త ఆర్థిక బాధ్యతను తీసుకుంటే, భార్య ఇంటి బాధ్యతలను చక్కబెడుతుందని, ఇంటి పనులు చేయాలని భర్త ఆదేశించినప్పటికీ అది క్రూరత్వం కిందకు రాదని హైకోర్టు చెప్పింది.

ఈ కేసులో భర్త, భార్య కోరికకు తలొగ్గి వేరు కాపురం పెట్టినా కూడా తనను విడిచి ఆమె తన తల్లిదండ్రుల వద్ద ఉంటుందని పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు. 2010 నుంచి భార్యభర్తలు వేరువేరుగా ఉంటున్నట్లు కోర్టు గమనించింది. వేరుగా ఉండేందుకు భర్త అంగీకరించినా, భార్య తన తల్లిదండ్రుల వద్ద ఉండటంతో పాటు కొడుకును కూడా అతని దూరంగా ఉంచిందని, భార్య చేతిలో భర్త క్రూరత్వానికి గురయ్యాడని కోర్టు అభిప్రాయపడింది. ఇద్దరికి విడాకులు మంజూరు చేస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

Exit mobile version