Site icon NTV Telugu

Wedding Anniversary: ఘోరం.. పెళ్లిరోజున భార్యతో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి

Upweddingday

Upweddingday

చావు ఎప్పుడు.. ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కళ్ల ముందు ఉన్నవారే కానరాకుండా పోతున్నారు. ఈ మధ్య చావులు చాలా విచిత్రంగా జరుగుతున్నాయి. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా హఠాత్తుగా ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో చోటుచేసుకుంది.

వసీం సర్వత్ (50), ఫరా ఇద్దరూ భార్యాభర్తలు. వసీం సర్వత్ షూ వ్యాపారవేత్త. దంపతులిద్దరికీ వివాహమై 25 ఏళ్లైంది. ఇంకేముంది దీన్ని పురస్కరించుకుని గ్రాండ్‌గా వేడుక నిర్వహించుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. దీని కోసం ప్రత్యేక ఆహ్వాన పత్రికను ముద్రించారు. స్వయంగా దంపతులిద్దరూ బంధువులను కలిసి ఆహ్వాన కార్డులను అందజేశారు. వేడుక కోసం పిలిభిత్ బైపాస్ రోడ్డుపై ఉన్న ఒక మండపాన్ని బుక్ చేశారు.

గ్రాండ్‌గా వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. శ్రేయోభిలాషులు, బంధువులు, స్నేహితులంతా వేడుకకు హాజరయ్యారు. సందడి.. సందడిగా, ఉల్లాసంగా.. ఉత్సాహంగా కార్యక్రమం జరుగుతోంది. ఈ ఆనందంలో దంపతులిద్దరూ సాంప్రదాయ దుస్తులు ధరించి స్టేజ్‌పై చాలా జాలిగా డ్యాన్స్ చేస్తున్నారు. హాజరైనవారంతా చప్పట్లతో ఉత్తేజపరిచారు. అంతే.. అంతలోనే వాతావరణమంతా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. ఉన్నట్టుండి వసీం సర్వత్ స్టేజ్‌పై కుప్పకూలిపోయాడు. ఉన్న చోటునే గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. భార్య, బంధువులంతా సపర్యలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అకస్మాత్తుగా ప్రాణాలు పోయాయి. అయినా కూడా కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. ఒకసారిగా వినోదం కాస్త.. విషాదంగా మారిపోయింది. చూసిన వారంతా అవాక్కైపోయారు. కన్నీరు మున్నీరుగా విలపించారు. భార్యను ఓదార్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Exit mobile version