West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ‘‘బాబ్రీ మసీదు’’కు శంకుస్థాపన చేసిన, తృణమూల్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. బాబ్రీ మసీదును కూల్చేసిన డిసెంబర్ 6న ఆయన బెల్దంగాలో మసీదుకు శంకుస్థాపన చేశారు. అయితే, ఈ వివాదంపై తృణమూల్ ఈయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీని తర్వాత, కబీర్ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ వచ్చే ఏడాది అధికారంలోకి రాకుండా చేస్తానని హెచ్చరించారు.
Read Also: Virat Kohli-Vizag: విశాఖ అంటేనే ఊపొస్తుందా?.. విరాట్ కోహ్లీ గణాంకాలు చూస్తే పిచ్చెక్కడం పక్కా!
ఇదిలా ఉంటే ఆయన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), సీఎం మమతా బెనర్జీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “తృణమూల్ ముస్లిం ఓటు బ్యాంకు ముగిసిపోతుంది,” అని మమతాకు హెచ్చరికలు జారీ చేశారు. ‘‘పిక్చర్ అభి బాకీ హై’’ అంటూ కామెంట్స్ చేశారు. బాబ్రీ మసీదుకు పునాదిరాయి వేసిన ఒక రోజు తర్వాత ఆయన నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. డిసెంబర్ 22న తాను సొంత పార్టీని ఏర్పాటు చేస్తానని చెప్పారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం పార్టీలో పొత్తు పెట్టుకుంటానని కబీర్ అన్నారు. వచ్చే ఏడాది జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌లోని 294 స్థానాలకు గానూ 135 స్థానాల్లో అభ్యర్థుల్ని పోటీలోకి దింపుతానని చెప్పారు. ఈ చర్య రాష్ట్ర రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ అవుతుందని చెప్పారు.
బెంగాల్లో బీజేపీని అధికారంలోకి రానివ్వనని కబీర్ చెప్పారు. భారతదేశంలో ముస్లింలకు చాలా నిధులు ఉన్నాయని, వారు బాబ్రీ నిర్మాణానికి సహాయం చేస్తారని చెప్పారు. లౌకికి సిద్ధాంతాన్ని తాను నమ్ముతానని, టీఎంసీ తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని, బీజేపీ మసీదు నిర్మాణాన్ని ఉద్రిక్తతలు పెంచేందుకు వాడుకుందని ఆయన చెప్పారు. అయితే, హుమాయన్ కబీర్ మసీదు నిర్మాణం అంతా మమతా బెనర్జీ ఎన్నికల స్టంట్ అని బీజేపీ ఆరోపించింది. బాబ్రీ మసీదును బెంగాల్ లో ఎప్పటికీ అంగీకరించబోమని కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ అన్నారు.