NTV Telugu Site icon

Rahul Gandhi: ఉద్రిక్తంగా మారన రాహుల్ గాంధీ సంభాల్ పర్యటన..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: ఉత్తర్ ప్రదేశ్‌లో ఇటీవల సంభాల్‌‌లోని షాహీ జామా మసీదు సర్వే వివాదం తీవ్ర హింసకు కారణమైంది. రాళ్లదాడి, గృహాల ధ్వంసం, వాహనాలకు నిప్పంటించిన గుంపు హింసాత్మకంగా ప్రవర్తించింది. ఈ హింసాత్మక దాడుల్లో ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఇదిలా ఉంటే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీలు రోజు సంభాల్ వెళ్లేందుకు ప్రయత్నించడం వివాదాస్పదంగా మారింది. ఢిల్లీ -నోయిడా రహదారిపై హైడ్రామా కొనసాగింది. రాహుల్ గాంధీ వెళ్లేందుకు పోలీసులు అడ్డుచెప్పారు.

పోలీసులు జాతీయ రహదారిని దిగ్భందించడంతో సరిహద్దుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. రహదారికి అడ్డంగా బారికేట్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ని స్తంభింపచేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లు ఎక్కేందుకు ప్రయత్నించారు. ఉదయం 10.15 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరిని కాన్వాయ్‌ని 11 గంటల ప్రాంతంలో యూపీ సరిహద్దుల్లో అడ్డుకున్నారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు. ‘‘మన దేశంలో శాంతి, మత సామరస్యం కోసం బాధిత కుటుంబాలను కలవాలనుకుంటున్నాము. ప్రభుత్వం తమకు సంభాల్ వెళ్లేందుకు అనుమతించాలి’’ అని ట్వీట్ చేశారు.

Read Also: HYD Cyber Crime Police: తస్మాత్‌ జాగ్రత్త.. ఈ నంబర్ల నుంచి ఫోన్‌ వస్తుందా? లిప్ట్‌ చేయొద్దు..

కాంగ్రెస్ నాయకులు జిల్లాలోకి ప్రవేశించే ముందు వారిని అడ్డుకోవాలని సంభాల్ అధికారులు పొరుగు జిల్లాలకు లేఖలు రాశారు. బులంద్ షహర్, అమ్రోహా, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధనగర్ అధికారులు లేఖలు పంపారు. రాహుల్ గాంధీని, కాంగ్రెస్ నేతల్ని సరిహద్దుల్లో అడ్డుకోవాలని కోరారు. ప్రభుత్వం వైఖరిని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తప్పుపట్టారు. సంభాల్‌లో అల్లర్లు జరిగాయని, అందుకే అక్కడి వెళ్తున్నామని, అక్కడికి వెళ్లే హక్కు మాకుందని అని అన్నారు.

సంభాల్‌లోని జామా మసీదు ప్రాచీన్ హరిహర్ మందిరమని హిందూ పక్షం స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కోర్టు మసీదు సర్వేకి అనుమతించింది. నవంబర్ 24న సర్వేకోసం వెళ్లిన అధికారులపై వేల సంఖ్యలో గుంపు రాళ్ల దాడికి పాల్పడింది. కొందరు గన్ ఫైర్ చేశారు. అయితే, ఈ హింసాత్మక అల్లర్లను అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ పేల్చాల్చి వచ్చింది. ఈ హింసాత్మక అల్లర్లలో ఐదుగురు మరణించారు. 30 మంది వరకు పోలీసులకు గాయాలయ్యాయి. సంభాల్ హింసలో పాకిస్తాన్‌కి చెందిన ఆరు బుల్లెట్ కాట్రిడ్జ్‌లను ఫోరెన్సిక్ స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనపై 7 ఎఫ్ఐఆర్లు బుక్ అయ్యాయి. స్థానిక సమాజ్ వాదీ (ఎస్పీ) ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే కుమారుడి హస్తం కూడా ఉన్నట్లు అభియోగాలు నమోదయ్యాయి.

Show comments