Mehul Choksi: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) రూ.13 వేల కోట్ల స్కామ్ కి పాల్పడి పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి బెల్జియంలో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. భారతదేశానికి తనను అప్పగించకుండా నిలువరించాలంటూ దాఖలు చేసిన అప్పీల్‌ను బెల్జియంలోని అత్యున్నత న్యాయస్థానం కోర్ట్ ఆఫ్ కసేషన్ తిరస్కరించింది. భారత్‌లో తనకు న్యాయం దక్కదని, తీవ్రంగా హింసకు గురి చేస్తారని చోక్సీ చేసిన వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. చోక్సీపై భారతదేశంలో కోర్టులు సక్రమంగా పని చేస్తున్నాయి, అతడికి అన్యాయం జరిగే అవకాశం లేదని పేర్కొంది. అలాగే, అతడు ప్రస్తావించిన ‘ఫ్లాగ్రంట్ డినైల్ ఆఫ్ జస్టిస్’, హింస, అవమానకరమైన ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలు నమ్మదగినవిగా లేవని స్పష్టం చేసింది. అప్పీల్‌ను తిరస్కరించడమే కాకుండా, చోక్సీ 104 యూరోల జరిమాన కూడా విధించింది.
Read Also: Vidyabalan : సౌత్ ఇండస్ట్రీలో సెలెక్టివ్‌గా అడుగులు వేస్తున్న విద్యాబాలన్
అయితే, ఇంతకుముందు ఆంట్వెర్ప్ కోర్ట్ ఆఫ్ అప్పీల్‌లోని ఇండిక్ట్‌మెంట్ ఛాంబర్ ఇచ్చిన తీర్పును కోర్ట్ ఆఫ్ కసేషన్ సమర్థించింది. మెహుల్ చోక్సీ సమర్పించిన పత్రాలు, భారత్‌లో అతడికి వాస్తవంగా తీవ్రమైన ప్రమాదం ఉందని నిరూపించేందుకు సరిపోవని ఇప్పటికే దిగువ కోర్టు తేల్చింది. కోర్ట్ ఆఫ్ కసేషన్ పాత్ర చట్టం సరిగ్గా అమలైందా? న్యాయపరమైన ప్రక్రియలు పాటించబడ్డాయా? అన్నదాన్ని మాత్రమే పరిశీలించడమేనని స్పష్టం చేస్తూ, ఈ కేసులో ఎలాంటి చట్టపరమైన లోపాలు లేవని వెల్లడించింది.
Read Also: Brazil: 10వ అంతస్తు నుంచి పడి బ్రెజిలియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ మృతి.. ఏం జరిగిందంటే..!
ఇక, మెహుల్ చోక్సీ తన అప్పీల్‌లో ఆంటిగ్వా నుంచి తనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణలు, ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు తొలగింపు, మీడియా కథనాలు, భారత్‌లో న్యాయమైన విచారణ జరగదన్న వాదనలను ప్రస్తావించాడు. అయితే, 2022 నవంబర్‌లో ఇంటర్‌పోల్‌కు చెందిన సీసీఎఫ్ (Commission for the Control of Interpol’s Files) అతడి పేరును రెడ్ నోటీసు జాబితా నుంచి తొలగించినప్పటికీ, అది ఈ కేసుపై ప్రభావం చూపదని బెల్జియం కోర్టు స్పష్టం చేసింది. మొదటిసారి అన్ని వివరాలు సమర్పించకపోయినా, అప్పీల్ దశలో పూర్తి వాదనలు వినిపించే అవకాశం లభించినందున చోక్సీ హక్కులు ఉల్లంఘించబడలేదని తెలిపింది. కాగా, ముంబై ప్రత్యేక కోర్టు 2018 మే, 2021 జూన్‌లో జారీ చేసిన అరెస్ట్ వారెంట్లు చెల్లుబాటవుతాయని ఇప్పటికే బెల్జియంలోని దిగువ కోర్టులు తేల్చిన విషయాన్ని కోర్ట్ ఆఫ్ కసేషన్ మరోసారి ధ్రువీకరించింది.
Read Also: Nidhi Agarwal, Chinmayi : ఫ్యాన్స్ ముసుగులో మృగాలు! నిధి అగర్వాల్ ఘటనపై చిన్మయి ఫైర్
కాగా, బెల్జియం కోర్టు ఇచ్చిన తీర్పుతో వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని భారత్‌కు అప్పగించే ప్రక్రియకు మార్గం సుగమమైంది. అయితే, చోక్సీ 2018 జనవరిలో, పీఎన్‌బీ కుంభకోణం వెలుగులోకి రావడానికి కొద్ది రోజుల ముందే భారత్‌ను విడిచి పెట్టాడు. ఈ కేసులో సీబీఐ ఆరోపణల ప్రకారం, మొత్తం రూ.13 వేల కోట్ల స్కాం కేసులో చోక్సీ ఒక్కరే రూ.6,400 కోట్లను కాజేశాడు. భారత్ అభ్యర్థన మేరకు 2018 డిసెంబర్‌లో ఇంటర్‌పోల్ అతడి పేరును రెడ్ నోటీసులో చేర్చింది. 2024 ఆగస్టు 27వ తేదీన భారత్ బెల్జియంకు అధికారికంగా చోక్సీ అప్పగింత అభ్యర్థన పంపింది. విచారణ సమయంలో అతడి భద్రత, మానవ హక్కులు, వైద్య అవసరాలు, జైలు సదుపాయాలపై బెల్జియంకు ఇండియా హామీలు కూడా ఇచ్చింది. తాజా తీర్పుతో చోక్సీ భారత్‌కు రప్పించే ప్రయత్నాలకు మరింత బలం చేకూరినట్టైంది.
