Puja Khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ట్రైనీగా ఉన్న సమయంలోనే ప్రత్యేకాధికారాలు కోరడంతో ఈమె వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 2022లో జరిగిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌లో ప్రత్యేక సడలింపు కోసం తప్పుడు మార్గాలకు పాల్పడినట్లు ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆమెపై విచారణకు ఒక సభ్య కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. మరోవైపు యూపీఎస్‌సీ పూజపై చర్యలు తీసుకుంది. ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ యూపీఎస్‌సీ నోటీసులు జారీ చేసింది. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆమె తల్లి మనోరమ తుపాకీ ఉపయోగించి ఓ రైతును బెదిరించడం వైరల్‌గా మారడంతో ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసింది. అక్రమంగా నిర్మించిన పూజా ఖేద్కర్‌కి సంబంధించిన ఆస్తుల్ని మహాప్రభుత్వం కూల్చేసింది.
ఇదిలా ఉంటే పూజా ఖేద్కర్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. సివిల్ సర్వీస్ ఎగ్జామ్‌లో నకిలీ వైకల్య సర్టిఫికేట్లు, కుల ధృవీకరణ పత్రాలను సమర్పించిన వివాదంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె మెడికల్ సర్టిఫికేట్లలో అనేక వ్యత్యాసాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంగవైకల్య ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో పూజా ఖేద్కర్ వివిధ పేర్లను వాడినట్లు తెలుస్తోంది. మూడేళ్లలో 3 సార్లు వైకల్య ధృవీకరణ పత్రాలను పొందినట్లు తేలింది. ఆమె ఖేద్కర్ పూజ దీలిప్రావ్, పూజ మనోరమ దిలీప్ ఖేద్కర్ అనే రెండు వేర్వేరు పేర్లను ఉపయోగించింది.
Read Also: Beerla Ilaiah: బీఆర్ఎస్ నాయకులు గవర్నర్ను కలవడంపై ప్రభుత్వ విప్ తీవ్ర వ్యాఖ్యలు..
2019లో పూజా ఖేద్కర్ అహ్మద్ నగర్ జిల్లా ఆస్పత్రి నుంచి దృష్టిలోపం ఉన్న సర్టిఫికేట్ పొందింది. 2021లో ఆమె అదే ఆస్పత్రి నుంచి దృష్టిలోపంతో పాటు మానసిక అనారోగ్యం రెండూ కలిపి సర్టిఫికేట్ పొందింది. 2022లో యూపీఎస్‌సీకి ప్రయత్నించడానికి తన వైకల్యాన్ని నిరూపించుకోవడానికి పూజా ఖేద్కర్ పింప్రిలోని యశ్వంత్‌రావు చవాన్ మోమోరియల్ ఆస్పత్రిలో లోకోమోటర్ వైకల్యం కోసం దరఖాస్తు చేసింది. పాత సర్టిఫికేట్లను ఉటంకిస్తూ ఆమె ఎడమ మోకాలిలో 7 శాతం లోకో మోటార్ వైకల్యాన్ని పేర్కొటతూ ఆస్పత్రి సర్టిఫికేట్ జారీ చేసింది. దీని కోసం ఖేద్కర్ తాను పింప్రి చించ్వాడ్ నివాసి అని పేర్కొంటూ నకిలీ రేషన్ కార్డుని చూపించింది.తప్పుడు చిరునామానున ఇచ్చింది.
లోకోమోటర్ వైకల్యం కోసం ఏకకాలంలో పింప్రి యశ్వంత్ రావు చవాన్ అస్పత్రితో పాటు ఔంద్ సివిల్ ఆస్పత్రిలో దరఖాస్తు చేసింది. పింప్రి ఆస్పత్రి వైకల్య ధృవీకరణ సర్టిఫికేట్ జారీ చేయడంతో ఆటోమెటిక్‌గా ఔంద్ ఆస్పత్రిలో పెట్టుకున్న దరఖాస్తు తిరస్కరించబడింది. యశ్వంత్ చవాన్ ఆస్పత్రి సర్టిఫికేట్ ఆధారంగా ఆమె వైకల్యం ఉన్న వ్యక్తి కేటగిరి కింద యూపీఎస్‌సీ ఇచ్చే ప్రయోజనాలు పొంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌కి హాజరైంది.