NTV Telugu Site icon

USA: పీఎం మోడీ యూఎస్‌ పర్యటనకు ముందు.. ఖలిస్తాన్ గ్రూపులతో వైట్‌హౌజ్ సమావేశం..

Usa

Usa

USA: అమెరికా డెలావర్‌లో జరగబోయే భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా కూటమి ‘‘క్వాడ్ ’’ సమావేశం కోసం ప్రధాని నరేంద్రమోడీ బయలుదేరాడు. అయితే, అమెరికాలో మోడీ అడుగుపెట్టే కొన్ని గంటల ముందు వైట్‌హౌజ్ అధికారులు ఖలిస్తానీ మద్దతు గ్రూపులతో సమావేశమైంది. ‘‘అమెరికా గడ్డపై ఏదైనా అంతర్జాతీయ దురాక్రమణ నుంచి రక్షణ’’ ఇస్తామని సదరు సిక్కు గ్రూపులకు వైట్‌హౌజ్ అధికారుల నుంచి హామీ వచ్చింది. అమెరిలో ఉన్నప్పుడు అమెరికన్ పౌరులను హాని నుంచి రక్షించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.

కెనడా, అమెరికా భారత వ్యతిరేక ఖలిస్తానీ వ్యక్తులకు, గ్రూపులకు ఆశ్రయం ఇస్తుందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే ఈ సమావేశం జరిగింది. ఖలిస్తాన్ వేర్పాటువాద ఉద్యమంతో జతకట్టిన సమూహాలను భారత్‌లో నిషేధించారు. వీటిలో అనేక సంస్థలకు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉంది. పలు సందర్భాల్లో ఖలిస్తాన్ ఉద్యమాన్ని వాక్‌స్వాతంత్య్రంగా కెనడా పేర్కొంది. అమెరికా మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

Read Also: Viral Video: పిచ్చి బాగా ముదిరింది.. బావి అంచున కూర్చొని పసిబిడ్డతో రీల్స్

డెలావేర్ క్వాడ్ సమ్మిట్‌లో పాల్గొనడంతో పాటు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ‘‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’’ కార్యక్రమంలో ప్రసంగించడానికి ప్రధాని మోడీ అమెరికాకు వెళ్లారు. అమెరికాలో ల్యాండ్ అయ్యే కొన్ని గంటల ముందే అమెరికన్ సిక్కు కాకస్ కమిటీకి చెందిన ప్రీత్‌పాల్ సింగ్‌తో పాటు సిక్ కొలీషన్ అండ్ సిక్ అమెరికన్ లీగల్ డిఫెన్స్ ఎడ్యుకేషన్ ఫండ్((SALDEF) ప్రతినిధులు వైట్‌హౌజ్ అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు ప్రీత్‌పాల్ సింగ్ ఎక్స్ పోస్టులో ..అమెరికన్ అధికారులు సిక్కు అమెరికన్లను రక్షించడంలో అప్రమత్తంగా ఉన్నందకు ధన్యవాదాలు తెలిపారు. సిక్కు వేర్పాటువాదులతో అమెరికా జాతీయ భద్రతా మండలి సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి.

సిక్కు వేర్పాటువాది, భారత్‌ చేత ఉగ్రవాదిగా గుర్తించబడిన హర్దీప్ సింగ్ నిజ్జర్‌కి SALDEF పూర్తి మద్దతు ఇస్తుంది. మరో ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యాయత్నం కుట్రలో భారత్ ప్రమేయం ఉందని అమెరికా న్యాయశాఖ ఆరోపిస్తోంది. ఈ కేసులో భారత ప్రభుత్వంపై, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌పై న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ ఫర్ డిస్ట్రిక్ట్ కోర్టు సమన్లు జారీ చేసింది. సమన్లలో భారత ప్రభుత్వం, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, మాజీ R&AW చీఫ్ సమంత్ గోయెల్, R&AW ఏజెంట్ విక్రమ్ యాదవ్ మరియు ఒక భారతీయ జాతీయుడు నిఖిల్ గుప్తా పేర్లు ఉన్నాయి. ఈ హత్యాయత్నం కేసులో 21 రోజుల్లో సమాధానం ఇవ్వాలని సమన్లలో కోరింది. అయితే, భారత్ వీటిని పూర్తి అసమంజసమైన కేసుగా పేర్కొన్నారు.