Supreme Court: ఒక కుటుంబంలో జీతం తీసుకువచ్చే ఉద్యోగి ఎంత ముఖ్యమో, గృహిణి పాత్ర కూడా అంతే ముఖ్యమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కుటుంబాన్ని చూసుకునే స్త్రీ విలువ చాలా ఉన్నతమైందని, ఆమె పని అమూల్యమైనదని పేర్కొంటూ.. ఆమె సేవల్ని డబ్బుతో లెక్కించడం కష్టమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక మోటార్ ప్రమాదం కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఆమెకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని రూ. 6 లక్షలకు పెంచింది.
వాహన ప్రమాద కేసులో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం నాడు నష్టపరిహారాన్ని రూ. 6 లక్షలకు పెంచుతూ తీర్పు ఇచ్చింది. ఇంట్లో గృహిణి విధులు చాలా ముఖ్యమైనవి, ఆమె చేసే కార్యకలాపాలను ఒక్కొక్కటిగా లెక్కించినట్లైతే వాటి విలువ అమూల్యమైందిగా ఉంటుంది, ఆమె ఇచ్చి సహకారం చాలా ఉన్నతమైందని, అందులో ఎలాంటి సందేహం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. 2006 ప్రమాదంలో మరణించిన మహిళకు మెరుగైన పరిహారాన్ని నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
బాధిత మహిళ ప్రయాణిస్తున్న వాహనానికి ఇన్సూరెన్స్ లేకపోవడంతో ఆమె కుటుంబానికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత వాహన యజమానిపై పడింది. ఒక మోటార్ యాక్సికెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్ ఆమె కుటుంబానికి, ఆమె భర్త, మైనర్ కుమారుడికి రూ. 2.5 లక్షల నష్టపరిహారాన్ని ఇచ్చింది. సదరు కుటుంబం ఎక్కువ నష్టపరిహారం కోసం ఉత్తరాఖండ్ హైకోర్టులో అప్పీల్ చేసింది. అయితే, మహిళ గృహిణి అని 2017లో వారి విజ్ఞప్తిని తోసిపుచ్చారు. ఇదిలా ఉంటే హైకోర్టు పరిశీలనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. గృహిని ఆదాయాన్ని రోజూవారీ కూలీ కంటే తక్కువగా ఎలా పరిగణిస్తారు.? అలాంటి విధానాన్ని మేం అంగీకరించమని పేర్కొంది. పరిహారాన్ని రూ.6 లక్షలకు పెంచుతూ, మరణించిన మహిళ కుటుంబానికి ఆరు వారాల్లోగా చెల్లించాలని వాహన యజమానిని సుప్రీంకోర్టు ఆదేశించింది. గృహిణి విలువను ఎవరూ తక్కువగా అంచనా వేయకూడదని చెప్పింది.