Sir Ganga Ram: పాకిస్తాన్ వంటి దేశానికి మతోన్మాదం, ఉగ్రవాదమే ముఖ్యం. ముఖ్యంగా భారత్ అన్నా, హిందువులన్నా ద్వేషం. కానీ ఒక్క హిందువును మాత్రం పాకిస్తాన్ ఇప్పటికీ ఎంతో గౌరవిస్తోంది. భారత్-పాకిస్తాన్ విభజన జరిగి 77 ఏళ్లు పూర్తయినప్పటికీ పాకిస్తాన్‌లో ఆయన ఉనికి శాశ్వతంగా ఉంది. ఆయన మరెవరో కాదు సర్ గంగా రామ్. 1921లో లాహోర్‌లో ఆస్పత్రిని నిర్మించిన సివిల్ ఇంజనీర్, దాత. ఇప్పటికీ ఈ ఆస్పత్రి పాకిస్తాన్‌లో ప్రతీ రోజు వేల మందికి చికిత్స అందిస్తోంది. ‘‘ఆధునిక లాహోర్ రూపశిల్పి’’గా ఇప్పటికీ దాయాది దేశం ఆయనను గౌరవిస్తోంది. జూలై 10న సర్ గంగారామ్ వర్ధంతి.
Read Also: Shikhar Dhawan: అంతర్జాతీయ క్రికెట్‌లో నేను ఎదుర్కొన్న డేంజరస్ బౌలర్లు వాళ్లే..
లాహోర్ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తుల్లో సర్ గంగా రామ్ ఒకరు. సివిల్ ఇంజనీర్‌గా నగర అభివృద్ధికి తోడ్పాటు అందించారు. అనేక ఎకరాలను సాగు భూమిగా మార్చడంలో కీలకంగా వ్యవహరించారు. పాకిస్తాన్‌లోని సాంస్కృతిక రాజధాని అయిన లాహోర్ నగర రూపశిల్పిగా ఈయనకు పేరుంది. ప్రస్తుతం లాహోర్‌లోని అత్యంత విలాసవంతమైన మోడల్ టౌన్ ఏరియాను కూడా ఈయనే నిర్మించారు. భవనాలతో పాటు, లాహోర్‌లో నీటి ప్లాంట్లను ఏర్పాటు చేశారు. పఠాన్ కోట్-అమృత్‌సర్ మధ్య రైల్వే ట్రాక్‌ను నిర్మించారు. గంగా రామ్ సామాజిక సేవ మరియు దాతృత్వానికి ఆకర్షితుడైన బ్రిటిష్ ప్రభుత్వం అతనికి ‘సర్’ బిరుదుతో సత్కరించింది.
దేశ విభజనకు ముందు 1923లో ఆయన గంగా రామ్ ట్రస్ట్‌ని స్థాపించారు. గంగా రామ్ ఛారిటబుల్ హాస్పిటల్‌కి పునాది వేశారు. సర్ గంగా రామ్ 1851 ఏప్రిల్ 13న పాకిస్తాన్‌లోని పంజాబ్‌లోని మంగ్తన్‌వాలా గ్రామంలో జన్మించారు. ఆ తర్వాత అమృత్‌సర్ వెళ్లి, అక్కడే మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందారు. జూలై 10, 1927లో లండన్‌లో మరణించారు. ఆయన వారసత్వం ఇప్పటికీ లాహోర్ నగరంతో ముడిపడి ఉంది. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం ఢిల్లీకి వచ్చింది.
