Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ నాయకుడు, ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్ట్ వివాదాస్పదంగా మారింది. దేశద్రోహం కింద ఆయనని బంగ్లా అధికారులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలపై భారత్ తన ఆందోళనను బంగ్లాదేశ్‌కి తెలియజేసింది. చిన్మోక్ కృష్ణదాస్‌కి మద్దతుగా కోర్టు వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనారిటీలపై అక్కడి అధికారులు తీవ్రంగా దాడి చేశారు. ఈ హింసాత్మక అల్లర్లలో ఒక న్యాయవాది కూడా మరణించారు.
చిన్మోయ్ అరెస్టుపై బంగ్లాదేశ్ మాజీ సీఎం షేక్ హసీనా స్పందించారు. ‘‘సనాతన్ మత సంఘానికి చెందిన ఒక అగ్ర నాయకుడిని అన్యాయంగా అరెస్టు చేశారు, అతన్ని వెంటనే విడుదల చేయాలి. చిట్టగాంగ్‌లో ఒక ఆలయాన్ని తగులబెట్టారు. గతంలో, మసీదులు, పుణ్యక్షేత్రాలు, చర్చిలు, మఠాలు మరియు అహ్మదీయ సమాజం యొక్క ఇళ్లపై దాడులు, ధ్వంసం చేయడం, నిప్పు పెట్టడం వంటివి జరిగాయి.’’ అని ఆమె అన్నారు. ‘‘అన్ని వర్గాల ప్రజలు మతస్వేచ్ఛని బంగ్లా అధికారులు నిర్ధారించాలి’’ అని ఆమె కోరారు.
Read Also: Sircilla: కేటీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందే- ఐఏఎస్ అధికారుల సంఘం..
ఆర్థిక వ్యవస్థ, శాంతిభద్రతల పర్యవేక్షణలో తాత్కాలిక ప్రభుత్వాధినేత అయిన మహ్మద్ యూనస్ ప్రభుత్వంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత అధికార గ్రహీత అన్ని రంగాల్లో విఫలమయ్యారు. నిత్యవసర ధరలు పెరగడాన్ని నియంత్రించలేకపోతున్నారు. ప్రజలు జీవితాలకు భద్రత కల్పించడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. సామాన్య ప్రజలపై హింసను ఖండిస్తు్న్నట్లు చెప్పారు.
చిట్టగాంగ్‌లో ఒక న్యాయవాది మరణానికి దారి తీసిన హింసాత్మక సంఘటనలపై షేక్ హసినా తాత్కాలిక ప్రభుత్వాన్ని నిందించారు. టెర్రరిస్టులను శిక్షించడంలో మధ్యంతర ప్రభుత్వం విఫలమైతే, మానవహక్కుల ఉల్లంఘన శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. హత్యా నిందితులను కనుగొని శిక్షించాలని డిమాండ్ చేశారు. మైనారిటీ అవామీ లీగ్ నాయకులు, కార్మికులు, విద్యార్థుల హత్యలు, దాడులు జరుగుతున్నాయని, వారిని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని, దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని హసీనా అన్నారు.