NTV Telugu Site icon

Donald Trump: “భారత్‌కి అనుకూలం”.. అమెరికా హిందూ సంస్థ మద్దతు డొనాల్డ్ ట్రంప్‌కే..

Trump

Trump

Donald Trump: ‘‘హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్’’ అనే హిందూ సంస్థ వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కి మద్దతు ప్రకటించింది. ఎన్నికల్లో కీలక రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్ కొరోలినాలో డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. గురువారం సంస్థ చైర్మన్, వ్యవస్థాపకుడు ఉత్సవ్ సందుజా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కమలా హారిస్ ‘‘భారత్-అమెరికా సంబంధాలను చాలా అస్థిరపరుస్తారు’’అని పేర్కొన్నారు.

‘‘కమలా హారిస్ అమెరికా అధ్యక్షురాలైతే, ఆమె తన టీంలో కొంతమంది ఉదారవాద తోడేళ్లను ఉంచవచ్చు. వీరు ఆసియన్-అమెరికన్ ఓటర్లపై ప్రభావం చూపించే విధంగా సుప్రీంకోర్టుని తప్పుదారి పట్టించొచ్చు’’ అని అతను అన్నాడు. బైడెన్-హారిస్ పాలన సరిహద్దును సురక్షితంగా ఉంచలేదని చెప్పారు. ప్రెసిడెంట్ జో బైడెన్ తర్వాత రెండో స్థానంలో ఉన్న కమలా హారిస్ యూఎస్‌లోకి అక్రమ వలసల్ని అడ్డుకోలేదని ఆయన చెప్పారు.

Read Also: RG Kar Hospital: కోల్‌కతా ఆర్‌జి కర్ ఆసుపత్రిపై మరో ఆరోపణ..వైద్యుల నిర్లక్ష్యంతో యువకుడు బలి?

అక్రమ వలసదారుల కారణంగా అనేక నేరాలు పెరిగాయని, మాదకద్యవ్యాల అక్రమ రవాణా పెరిగిందని, ఇది మైనారిటీ వర్గాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందని, ముఖ్యంగా అనేక ఆసియా-అమెరికన్ వ్యాపార యజమానులను ప్రభావితం చేస్తుందని ఆయన పేర్కొన్నాడు. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను మరింత మెరిట్ ఆధారంగా మార్చడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను సందుజా ప్రశంసించారు. భారత రక్షణ, సాంకేతిక సహకారాన్ని పెంపొందించే విషయంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ చాలా కృషి చేశారని ప్రశంసించారు.

ట్రంప్ ‘‘భారత్‌కి చాలా అనుకూలం’’ ప్రధాని మోడీతో అద్భుతమైన సంబంధాలను పెంపొందించుకోగలిగారని, చైనాపై భారత్‌ని ఢీకొనేందుకు వీలుగా అనేక రక్షణ ప్రాజెక్టులకు సహకరించాలని ఆయన అన్నారు. భారత ప్రభుత్వం, ప్రజల గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన హారిస్ కాకుండా, ట్రంప్ దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోలేదని చెప్పారు. జార్జియా, నార్త్ కరోలి, పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్, అరిజోనా, నెవడా వంటి కీలక రాష్ట్రాల్లో హిందువులు హరిస్‌కి వ్యతిరేకంగా ఉండేందుకు హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల ప్రపంచ హిందూ సమాజం ఆందోళన చెందుతోందని సందుజా అన్నారు.