NTV Telugu Site icon

World Largest Pen: ప్రపంచంలోనే అతి పెద్ద పెన్ను.. దీని ప్రత్యేకతలు చూస్తే ఆశ్చర్చపోతారు

World Largest Pen

World Largest Pen

World Largest Pen: సాధారణంగా మనం రాసుకునే పెన్ను జానా బెత్తెడు ఉంటుంది. అంత సైజు ఉంటేనే పెన్నుతో మనం రాయగలం. కానీ అదే పెన్ను 20 అడుగులు ఉంటే అది రికార్డే అవుతుంది. తాజాగా దేశంలోని ఓ పెన్ను ప్రపంచంలోనే అతి పెద్ద పెన్నుగా అవతరించింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిర్మౌర్‌ జిల్లాలోని నౌరంగాబాద్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సంజీవ్‌ అట్రీ అతిపెద్ద ఇంక్‌ పెన్ను తయారు చేశాడు. 20 అడుగుల పొడవు, 43 కిలోల బరువు గల ఈ పెన్ను ప్రపంచ రికార్డును నమోదు చేసింది. ఇందులో రికార్డరుతో పాటు సీసీ టీవీ కెమెరాను కూడా అమర్చడం విశేషం.

Read Also: Rajastan: మధ్యాహ్న భోజన కుంభకోణం.. హోంమంత్రికి చెందిన పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు

గతంలో 18 అడుగుల పొడవైన బాల్ పెన్‌ ప్రపంచ రికార్డుగా ఉంటే ఆ రికార్డును ఈ పెన్ను బద్దలు కొట్టింది. సెప్టెంబర్ 3న ఈ పెన్నును ప్రారంభించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సంజీవ్‌ తన పాఠశాలలోని విద్యార్థులందరికీ దీనిని అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈ పెన్ను రాయడమే కాదు పాఠాలు కూడా బోధిస్తుంది. ఈ పెన్నులో సౌండ్‌ సెన్సార్‌ ఉన్నందున ఉపాధ్యాయులు సెలవులో ఉన్నా పాఠాన్ని రికార్డు చేసి మొబైల్‌ నుంచి పంపితే చాలు.. అదే బోధిస్తుంది. పెన్నులో అమర్చిన సీసీ కెమెరా పాఠశాల భద్రతకు ఎంతో ఉపయోగకరం. సౌరశక్తితో ఛార్జ్‌ చేసుకునే సదుపాయం ఉంది. కాగా ఈ పెన్ పగటిపూట విద్యార్థులను పర్యవేక్షిస్తుందని.. రాత్రిపూట పాఠశాలకు కాపలా కాస్తుందని నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు. సైన్స్ బోధించే సంజయ్ అట్రీ.. ఉపాధ్యాయుల సహకారంతో ఈ పెన్ను డిజైన్‌ను సిద్ధం చేసి మూడు నెలల్లోనే తయారు చేశాడు. శక్తి అని నామకరణం చేయబడిన ఈ పెన్ను ధర రూ.45వేలు అని సంజయ్ వెల్లడించాడు.