NTV Telugu Site icon

Crime.

Crime.

2010లో సంచలనం సృష్టించిన ‘‘వార్ధా సామూహిక అత్యాచారం’’ కేసులో సంచలనం నమోదైంది. ఈ అత్యాచార కేసులో దోషులుగా తేలి, 10 ఏళ్లుగా జైలు శిక్ష విధించబడిన 8 మందిని నిర్దోషులుగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ప్రాసిక్యూషన్ సాక్ష్యాలు, ఫిర్యాదుదారుడి వాంగ్మూలంలో అసమానతలు ఉన్నట్లు కోర్టు పేర్కొంది.

కేసు నేపథ్యం ఇదే:

జూన్ 24, 2010న తనకు ఆరోగ్యం బాగాలేదని, దీంతో ఆస్పత్రికి వెళ్లినట్లు బాధితురాలు చెప్పింది. ఆ సమయంలో ఆస్పత్రి మూసి ఉందని, గ్రామానికి తిరిగి వచ్చేందుకు ఆటోరిక్షా కోసం ఒక పాఠశాలలో వేచి ఉన్నట్లు చెప్పింది. సాయంత్రం 4 గంటలకు ఒక నిందితుడు తన ఆటోతో సంఘటనా స్థలానికి చేరుకున్నాడని, అప్పటికే ఆటోలో నలుగురు ప్రయాణికులు కూర్చొని ఉన్నారని చెప్పింది. ఆటో తన గ్రామానికి వెళ్లకుండా, వేరే ప్రాంతానికి వెళ్లిందని, ఆటో డ్రైవర్ నలుగురు ప్రయాణికులను దింపేసి, ముందుకు వెళ్లాడని చెప్పింది.

ఆటోడ్రైవర్ సదరు మహిళను మరికొంత మంది వ్యక్తులతో కలిసి వేరే ఆటోకి మార్చారని, ఇద్దరు వ్యక్తులు బైక్‌తో ఆటోని వెంబడించారని ఆరోపించింది. మహిళను నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి, కండోమ్ ధరించి విడతల వారీగా తనపై అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. ఆ తర్వాత రాత్రి 9 గంటల ప్రాంతంలో, నిందితులు తనను బస్టాప్‌లో దించినట్లు చెప్పింది. ఇంటికి చేరిన తర్వాత బాధితురాలు విషయాన్ని తల్లికి తెలిపింది. ఆ తర్వాత పోలీసులు ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

కోర్టు విచారణ:

ఈ కేసులో ప్రధాన సాక్షలుగా ఉన్న బాధిత మహిళ, ఆమె తల్లి ప్రాసిక్యూషన్ వాదనలకు మద్దతు ఇవ్వలేదని కోర్టు చెప్పింది. మొదటగా మొదటి నిందితుడిని కేసులో మహిళ ఇరికించిందని, ఆ తర్వాత తానే పోలీసుల ఒత్తిడితో వాగ్మూలం ఇచ్చినట్లు చెప్పిందని కోర్టు పేర్కొంది. నమ్మశక్యం కాని ఆధారాల ఆధారంగా శిక్ష విధించలేమని కోర్టు చెప్పింది. నిందితుల ప్రమేయాన్ని నిర్ధారించడానికి ప్రాసిక్యూషన్ డీఎన్ఏ నివేదికపై ఎక్కువగా ఆధారపడింది. అయితే, ఫోరెన్సిక్ విశ్లేషణలో సరైన విధానపరమైన ఆధారాల ప్రామాణికతను ధృవీకరించడానికి నిపుణులైన సాక్షులను పిలవడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు చెప్పింది.

విచారణలో కోర్టు CrPC సెక్షన్ 164 కింద ఫిర్యాదుదారుడి వాంగ్మూలంపై ఎక్కువగా ఆధారపడింది. అయితే, క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో బాధితురాలు తన వాదనల్లో కొన్నింటిని తిరస్కరించింది. నిందితులను దోషులుగా నిర్ధారించే ముందు ట్రయల్ కోర్టు జాగ్రత్తగా వ్యవహరించాల్సిందని జస్టిస్ సనప్ అభిప్రాయపడ్డారు. సాక్షి సాక్ష్యంతో కొంత భాగం ప్రాసిక్యూషన్ కేసుతో సరిపోలినప్పటికీ, నేరాన్ని నిర్ణయించడంలో సాక్షి మొత్తం విశ్వసనీయత చాలా కీలకమని జస్టిస్ సనప్ హైలెట్ చేశారు. లోపభూయిష్ట దర్యాప్తులు లేదా బలవంతపు సాక్ష్యాల ఆధారంగా తప్పుడు శిక్షలు పడకుండా కోర్టులు నిర్ధారించుకోవాలని సూచించారు.