NTV Telugu Site icon

జమ్మూలో హై అలర్ట్‌ …

Jammu airport

Jammu airport

భారత భూభాగంలోకి డ్రోన్లు చొచ్చుకు రావడం… దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. జమ్మూలోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లోకి డ్రోన్లను పంపి… ఐఈడీలను జారవిడిచారు. అర్ధరాత్రి తర్వాత రెండు డ్రోన్లు రావడంతో… జవాన్లు వీటిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వాయుసేన సిబ్బందికి గాయాలయ్యాయి.. వాయుసేన స్థావరంపై దాడి జరిగిన 24 గంటల్లోనే మరో సైనిక స్థావరం వద్ద డ్రోన్ల సంచరించడం ఆందోళనకు గురి చేస్తోంది. డ్రోన్ల దాడి తర్వాత… జమ్ములో హై అలర్ట్‌ ప్రకటించారు. పోలీసులు, జవాన్లు… ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. జమ్ములోని వాయుసేన స్థావరంపై జరిగిన డ్రోన్‌ దాడి వివరాలు… ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పేలుళ్లకు ముందు రెండు డ్రోన్లు ప్రయాణించిన చప్పుడు వచ్చినట్లు గుర్తించారు. ఒక్కో డ్రోన్‌ 2 కిలోల చొప్పున అత్యంత శక్తిమంతమైన ఐఈడీలను మోసుకొచ్చినట్లు సైన్యం వెల్లడించింది. దాడి తర్వాత అవి సురక్షితంగా వెళ్లిపోయినట్లు భావిస్తున్నారు. దాదాపు 100 మీటర్ల ఎత్తు నుంచి వినియోగించి ఉండొచ్చని ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ అనుమానం వ్యక్తం చేస్తున్నాయి..

వీటిని పాకిస్థాన్‌ నుంచి లేదా స్థానిక ఉగ్రవాదుల సాయంతో భారత్‌ నుంచే ఆపరేట్‌ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. చీకటి ఉన్న కారణంగానే… లక్ష్యంగా సరిగా గుర్తించలేకపోయాయని… ప్రమాదం తీవ్రత కూడా తగ్గిందని చెబుతున్నారు. జమ్మూ కశ్మీర్‌లోకి డ్రోన్లు ప్రవేశించడంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఫైరయ్యారు. అత్యంత పకడ్బందీగా సెక్యూరిటీ ఉన్నా… భారత భూభాగంలోకి డ్రోన్లు ఎలా వచ్చాయన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారని అన్నారు. వాయుసేనపై దాడికి యత్నించిన డ్రోన్లు… అమెరికావో లేదంటే చైనా దేశానికి చెందినవో వెంటనే గుర్తించాలన్నారు. మరోసారి శత్రుదేశాలు డ్రోన్ల దాడికి పాల్పడకుండా… చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ ఆదేశాలు జారీ చేశారు.