Independence Day Celebrations 2022: ఎర్రకోటపై స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండా ఎగరవేసే దిల్లీలోని ఎర్రకోట పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు శనివారం దిల్లీ పోలీసులు వెల్లడించారు. ఎర్రకోట ప్రాంగణ ప్రవేశద్వారం వద్ద ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వేడుకకు 7 వేల మంది వీక్షకులు రానుండగా, 10 వేల మంది పోలీసులతో బహుళ అంచెల్లో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎర్రకోట నుంచి 5 కిలోమీటర్ల మేర నో ఫ్లయింగ్ జోన్‌ను ఏర్పాటు చేశారు. పతంగులు, డ్రోన్లు, చైనీస్ లాంతర్ల ఎగురవేతపై నిషేధం విధించారు. పారాగ్లైడర్లు, హాంగ్ గ్లైడర్లు, ఎయిర్ బెలూన్లు తదితరాల సంచారంపై జులై 22న విధించిన నిషేధాజ్ఞలు ఆగస్టు 16 వరకు అమలులో ఉంటాయని తెలిపారు. ఎర్రకోటపై యాంటీ డ్రోనో రాడార్‌ను ఏర్పాటు చేశారు. 10 వేల మంది సాయుధ బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.
Imran Khan: మరోసారి ఇండియాపై ప్రశంసలు.. జై శంకర్ వీడియోను చూపిస్తూ పొగిడిన ఇమ్రాన్ ఖాన్
డీఆర్డీవో, ఇతర రక్షణ విభాగాలు రూపొందించిన యాంటీ డ్రోన్, రాడార్ వ్యవస్థలను సిద్ధంగా ఉంచారు. సున్నిత ప్రాంతాల్లో 400 మంది కైట్ క్యాచర్స్‌ను నియమించారు. అత్యంత నాణ్యత గల సీసీ కెమెరాల ద్వారా అనుక్షణం పర్యవేక్షించనున్నట్లు ఢిల్లీ ప్రత్యేక కమిషనర్ దీపేందర్ పాఠక్ తెలిపారు. మరోపక్క, దిల్లీలోని ఆనంద్‌విహార్ ప్రాంతంలో శుక్రవారం పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుంచి 2వేలకుపైగా తూటాలను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. విధ్వంసక చర్యలను అరికట్టేందుకు పోలీసులు దేశ రాజధాని వ్యాప్తంగా గస్తీ ముమ్మరం చేశారు. ఢిల్లీలో ఇప్పటికే 144 సెక్షన్‌ను అమలులోకి తెచ్చినట్టు దేవేంద్ర పాఠక్ తెలిపారు. ఇటు నిఘా విభాగం హెచ్చరికలతో పోలీసులు పెట్రోలింగ్, తనిఖీలను ముమ్మరం చేశారు. హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, పార్కింగ్ స్థలాలు, రెస్టారెంట్లు తనిఖీలు చేస్తునాుమని, అద్దెదారుల, సేవకుల వెరిఫికేషన్‌ను నిర్వహిస్తున్నామని అధికారులు చెప్పారు.