NTV Telugu Site icon

Hezbollah: ఫిబ్రవరి 23న హిజ్బుల్లా అగ్రనేత హసన్ నస్రల్లా అంత్యక్రియలు..

Hassan Nasrallah

Hassan Nasrallah

Hezbollah: గతేడాది సెప్టెంబర్ నెలలో ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిలో హతమైన హిజ్బుల్లా అగ్రనేత హసన్ నస్రల్లా అంత్యక్రియలకు డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 23న అంత్యక్రియలు జరుగుతాయని ఇరాన్ మద్దతు కలిగిన ఉగ్ర సంస్థ హిజ్బుల్లా ప్రస్తుతం చీఫ్ నయీమ్ కస్సేమ్ ఆదివారం తెలిపారు. లెబనాన్ బీరూట్‌‌కి సమీపంలోని ఒక బంకర్‌పై వైమానిక దాడి చేసిన ఇజ్రాయిల్, నస్రల్లాని హతమార్చింది.

Read Also: Kishan Reddy: నిరుద్యోగం విషయంలో రాహుల్ గాంధీ తప్పుడు వ్యాఖ్యలు చేశారు..

నస్రల్లాని హతమార్చిన తర్వాత, ఆయన స్థానంలో హషీం సఫీద్దీన్‌ని హిజ్బుల్లా చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే, బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే అక్టోబర్ నెలలో ఇతడిని కూడా ఇజ్రాయిల్ చంపేసింది. నస్రల్లా అంత్యక్రియల రోజే సఫీద్దీన్ అంత్యక్రియలు కూడా నిర్వహించనున్నారు. నస్రల్లా మాత్రమే కాకుండా, హిజ్బుల్లా కీలక కమాండర్లను ఒక్కొక్కరిగా ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వెతికి వెతికి ఎలిమినేట్ చేసింది.

అక్టోబర్‌లో నస్రల్లా చనిపోయినప్పటికీ, భద్రత దృష్ట్యా అతడి అంత్యక్రియలు నిర్వహించలేదు. ఇజ్రాయిల్ దక్షిణ లెబనాన్‌‌పై, రాజధాని బీరూట్‌పై విరుచుకుపడుతుండటం కూడా ఇందుకు ఓ కారణం. అంత్యక్రియలకు హాజరైన పక్షంలో హిజ్బుల్లా ఇతర కీలక నేతల్ని కూడా ఇజ్రాయిల్, దాని గూఢచార సంస్థ మొస్సాద్ టార్గెట్ చేస్తుందని భయపడింది. నస్రల్లాని బీరూట్ శివారులోని ఓల్డ్-న్యూ ఎయిర్ పోర్టు రహదారుల మధ్యలో ఉన్న భూమిలో ఖననం చేస్తామని, సఫీద్దీన్‌ని దక్షిణ లెబనాన్‌లోని స్వస్థలమైన డీర్ కానున్‌లో ఖననం చేస్తానమని ప్రస్తుతం హిజ్బుల్లా చీఫ్ నయీమ్ కస్సేమ్ తెలిపారు.