Site icon NTV Telugu

Jharkhand Politics: జార్ఖండ్‌లో తెరపైకి రిసార్ట్ రాజకీయాలు..

Jharkhand Politics

Jharkhand Politics

Jharkhand Politics: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేసిన నేపథ్యంలో జార్ఖండ్ రాజకీయాల్లో అస్థిరత నెలకొన్న సంగతి తెలిసిందే. యూపీఏ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని హేమంత్ సోరెన్ ఆరోపించారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై ఏ క్షణంలోనైనా అనర్హత వేటు పడే అవకాశం ఉండటంతో ఆయన సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా ఎమ్మెల్యేలను శనివారం తన నివాసానికి పిలిపించారు. ఇప్పటికే చాలా మంది శాసనసభ్యులు లగేజీతో పాటు ముఖ్యమంత్రి ఇంటికి చేరుకున్నారు. ఎమ్మెల్యేలను ఎవరూ ప్రలోభాలకు గురి చేసే వీలు లేకుండా అందరినీ ఛత్తీస్‌గఢ్ తరలించాలని హేమంత్ సోరెన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి రిసార్ట్ రాజకీయాలు తెరపైకి వచ్చాయి.

గనులశాఖను కూడా పర్యవేక్షిస్తున్న హేమంత్ సోరెన్ మైనింగ్‌లో ఒక లీజును చేజిక్కించుకున్నారని, ఇది ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 9(ఏ) ఉల్లంఘనే అని పేర్కొంటూ బీజేపీ నేత, మాజీ సీఎం రఘుబర్‌దాస్‌ ఈ నెల 18న గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై గవర్నర్ ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కోరారు.అక్రమ మైనింగ్ కేసులో సోరెన్‌పై వచ్చిన ఆరోపణలు నిజమని నిర్ధారణ కావడంతో ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం జార్ఖండ్ గవర్నర్ రమేశ్ బయాస్‌కు సిఫారసు చేసింది. శుక్రవారం సోరెన్ శాస‌న స‌భ్యత్వాన్ని ర‌ద్దు చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద సోరెన్‌పై అన‌ర్హత వేటు వేశారు. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలతో పార్టీ ఫిరాయింపులకు తావీయకుండా ఎమ్మెల్యేలను రిసార్ట్‌లకు తరలించనున్నారు.

Arvind Kejriwal: ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ రూ.6,300 కోట్లు ఖర్చు చేసింది..

మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో యూపీఏ భాగస్వాములైన జేఎంఎంకు 30 , కాంగ్రెస్‌కు 18, ఆర్‌జేడీకి ఒక సభ్యుడితో కలిపి మొత్తం 49 మంది ఎమ్మెల్యేల బలముంది. ప్రతిపక్ష బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ప్రజల ఎన్నుకున్న తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని సీఎం హేమంత్ సోరెన్ శనివారం ఓ సమావేశంలో ఆరోపించారు. ప్రజల మద్దతు తమకే ఉన్నందుకు ఎలాంటి ఆందోళనా లేదని చెప్పారు. తన చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. అయితే మిత్రపక్షాల మద్దతుతో సోరెన్ సీఎంగా కొనసాగవచ్చు. మరో ఆరు నెలల్లో తిరిగి శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది.

 

Exit mobile version