NTV Telugu Site icon

Bharat Bandh: భారత్‌ బంద్‌ ఎఫెక్ట్.. దిల్లీ సరిహద్దులో భారీ ట్రాఫిక్‌ జామ్

Heavy Traffic Jam At Delhi

Heavy Traffic Jam At Delhi

కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్‌ను నిరసిస్తూ పలు సంఘాలు, రాజకీయ పార్టీలు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఈ నేప‌థ్యంలో ఢిల్లీలో బంద్ పాటిస్తున్నారు. దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

భారత్‌ బంద్‌ నేపథ్యంలో దిల్లీ సరిహద్దుల్లో పోలీసులు నేడు తనిఖీలు చేపట్టారు. దీంతో దిల్లీ – గురుగ్రామ్‌, దిల్లీ – నోయిడా హైవేలపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలను తనిఖీ చేసిన తర్వాతే దిల్లీ లోపలకు అనుమతిస్తామని పోలీసులు స్పష్టంగా చెప్పడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైవేలపై వేలాది వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

అగ్నిపథ్ ఆందోళనల దృష్ట్యా పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. బిహార్‌లోని రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను పెంచారు. ఝార్ఖండ్‌లో ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లను మూసివేసి సెలవు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డా స్టేషన్‌ వద్ద పోలీసు బలగాలు మోహరించాయి. నిరసనల నేపథ్యంలో ఉత్తరాదిలో పలు రైళ్లు రద్దయ్యాయి. ఏపీలోని విజ‌య‌వాడ‌లో రైల్వే స్టేష‌న్ వ‌ద్ద క‌ట్టుదిట్టమైన‌ భ‌ద్రత‌ను ఏర్పాటు చేశారు. రైల్వే స్టేష‌న్‌లోకి ఆందోళ‌న‌కారులు ప్రవేశించ‌కుండా ఉండేందుకు వైర్లను అమర్చారు. న‌గ‌రంలోని అన్ని ప్రధాన కూడ‌ళ్ల వ‌ద్ద అద‌న‌పు బ‌ల‌గాల‌ను మోహ‌రించారు.

ఇక యూపీలోని గోర‌ఖ్‌పూర్ రైల్వే స్టేష‌న్‌లో ప్రయాణికులు ఇక్కట్లు ప‌డుతున్నారు. భార‌త్ బంద్ నేప‌థ్యంలో కొన్ని రైళ్లను ర‌ద్దు చేశారు. కనీసం 4 గంట‌ల నుంచి స్టేష‌న్‌లో ఎదురుచూస్తున్నట్లు కొంద‌రు ప్రయాణికులు తెలిపారు. ట్రైన్ స్టేట‌స్ చెక్ చేస్తే ర‌ద్దు అయిన‌ట్లు లేద‌ని, కానీ స్టేష‌న్‌కు వ‌స్తే ఆ రైలును ర‌ద్దు చేసిన‌ట్లు చెబుతున్నార‌ని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఢిల్లీలో కాంగ్రెస్ నేత‌లు అగ్నిప‌థ్‌కు వ్యతిరేకంగా ధ‌ర్నా చేప‌ట్టారు. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ అంశంలోనూ కాంగ్రెస్ నేత‌లు జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న‌లో పాల్గొన్నారు. మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే, స‌ల్మాన్ ఖుర్షీద్‌, కె.సురేశ్, వి.నారాయ‌ణ‌స్వామితో పాటు ఇత‌ర నేత‌లు ఈ ధ‌ర్నాలో పాల్గొన్నారు. అగ్నిప‌థ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా కొన్ని రాష్ట్రాల్లో నిర‌స‌న‌లు భ‌గ్గుమ‌న్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఆయా రాష్ట్రాల్లో హై అలర్ట్ పాటిస్తున్నారు.