NTV Telugu Site icon

Wrestlers March: ఓ వైపు ప్రారంభోత్సవం.. మరోవైపు రెజ్లర్ల మార్చ్.. ఢిల్లీలో హై సెక్యూరిటీ..

Protest

Protest

Wrestlers March: కొత్త పార్లమెంట్ భవనం ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. ఇదిలా ఉంటే మరోవైపు జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై లైంగిక ఆరోపణలు చేసిన రెజ్లర్లు అతడిని అరెస్ట్ చేయాలని, పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పార్లమెంట్ వరకు శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చారు రెజ్లర్లు. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

Read Also: New Parliament: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ షెడ్యూల్.. ఇతర విశేషాలు..

పార్లమెంటుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజర్లు.. ఎలాగైనా కొత్త పార్లమెంట్ వద్దే తమ ‘‘మహిళా మహాపంచాయత్’’ నిర్వహిస్తామని చెప్పారు. అయితే “మహిళా మహాపంచాయత్” నిర్వహించేందుకు అనుమతి లేదని, నిరసనకారులెవరైనా అటువైపుగా వెళ్లేందుకు అనుమతించమని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలను కాపాడేందుకు సరిహద్దు ప్రాంతాల్లో ఇంటెన్సివ్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వేలాది మంది రైతులు ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీలోని ఘాజీపూర్ సరిహద్దు వద్ద గుమిగూడి, ఆ తరువాత రెజ్లర్లకు మద్దతు తెలుపుతారని రైతు సంఘం నాయకుడు రాకేష్ టికాయత్ తెలిపారు. ఇదిలా ఉంటే ఓల్డ్ బవానాలోని ప్రాథమిక బాలికల పాఠశాలలో ఆదివారం నాడు తాత్కాలిక జైలును ఏర్పాటు చేయడానికి అవసరమైన అనుమతిని మంజూరు చేయాలని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD)ని పోలీసులు అభ్యర్థించారు. అనేక మంది వీవీఐపీలు మరియు ఇతర ప్రముఖులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని, ప్రజలు తమ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని, ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ని తప్పించుకోవాలని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు కోరాారు.