గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మధ్యప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. కోత్రా గ్రామంలో కొంత మంది ఇంటి పైకప్పుపై ఉన్నారనే సమాచారంతో.. వారిని తీసుకొచ్చేందుకు మంత్రి నరోత్తమ్ మిశ్రా.. బోటుపై అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో బోటుకు అడ్డుగా చెట్టుకూలిపోవడంతో.. ఆయన చిక్కుకుపోయారు. ఈ సమయంలో తమను రక్షించాలంటూ అధికారులకు మెసేజ్‌లు పెట్టారు. దీంతో హుటాహుటిన ఐఏఎఫ్ హెలికాప్టర్‌ను అక్కడకు పంపి.. మంత్రి నరోత్తమ్ మిశ్రా సహా మరో 9 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
మధ్యప్రదేశ్‌లో వెయ్యికి పైగా గ్రామాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఆర్మీ సహా ఎన్డీఆర్‌ఎఫ్, బీఎస్ఎఫ్ దళాలు సహాయ చర్యల్లో పాల్గొని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. షేవోపూర్, దాతియా, గ్వాలియర్, గుణ, భిండ్, మోరేనా జిల్లాలో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక, బెంగాల్లో కూడా వరదల ఉధృతి కొనసాగుతోంది. ఆరు జిల్లాల్లో వరదల ప్రభావం ఉంది. దాదాపు 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారని.. బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. మరో మూడు రోజులపాటు వరషాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. దామోదర్ వ్యాలీ కార్పోరేషన్ డ్యామ్‌ల నుంచి నీటిని విడుదల చేయడంతో.. చాలా ప్రాంతాలు ముంపును ఎదుర్కొంటున్నాయి. ప్రధాని మోడీ.. సీఎం మమతా బెనర్జీకి ఫోన్ చేసి వరద పరిస్థితి గురించి తెలుసుకున్నారు.
