Site icon NTV Telugu

Kerala Rains: కేరళలో భారీ వర్షాలు.. పాఠశాలలు మూసివేత

Kerala Rains

Kerala Rains

Kerala Rains: కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలోని ఇడుక్కి, కాసరగోడ్, కన్నూర్ 3 జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షం కారణంగా ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా ఎర్నాకులం, కన్నూర్, ఇడుక్కి, త్రిసూర్, కొట్టాయం, కాసర్ గోడ్ సహా ఆరు జిల్లాల్లో విద్యాసంస్థలు మూసివేశారు. మంగళవారం ఒక్కరోజే ఇడుక్కి జిల్లా పీర్మాడేలో 100 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

Read also: Nikhil Siddhartha Apologies: మాట నిలబెట్టుకోలేకపోయా.. అభిమానులకు క్షమాపణలు చెప్పిన హీరో నిఖిల్!

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించేందుకు రెవెన్యూ మంత్రి రాజన్ అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భారీ వర్షం, బలమైన గాలుల కారణంగా కొల్లాం, అలప్పుజా, త్రిసూర్, కొట్టాయం, ఎర్నాకులం సహా పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ చెట్లు కూలడంతో కొల్లాం – షెంకోట్టై మార్గంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

Read also: Porn Addiction: పోర్న్‌కి బానిసయ్యాడు.. భార్యని కూడా అలాగే డ్రెస్సులు వేసుకోమని..

భారీ వర్షాలకు మధ్య కేరళ అంతటా నదుల్లో నీటి మట్టం పెరిగింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. పంబా నది నీటిమట్టం పెరగడంతో పతనంతిట్ట జిల్లా కురుంబన్ ముజిలో గిరిజన కాలనీకి చెందిన వందలాది కుటుంబాలు వరదలో చిక్కుకుపోయాయి. మీనాచిల్ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కొట్టాయం జిల్లాలోని పలు ప్రాంతాల నివాసితులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు సముద్రం అల్లకల్లోలంగా మారింది. బలమైన గాలుల కారణంగా తీర ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఎర్నాకులం జిల్లా నయారంబాలంలో అలలు భారీ ఎత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో తీర ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా చేపల వేటకు వెళ్లిన ఓ పడవ సముద్రంలో బోల్తాపడింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ సూచించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున హై-రేంజ్ రోడ్లపై అనవసర ప్రయాణాన్ని నివారించుకోవాలని, బీచ్ లు, నదుల వద్దకు వెళ్లొద్దని ప్రజలు, పర్యాటకులకు అధికారులు హెచ్చరించారు.

Exit mobile version