NTV Telugu Site icon

Himachal Pradesh: 22 నుంచి 24 వరకు భారీ వర్షాలు..కోల్‌దామ్‌ రిజర్వాయర్‌లో 10 మంది గల్లంతు

Himachal Pradesh

Himachal Pradesh

Himachal Pradesh: నైరుతు రుతుపవనాలు ప్రారంభం అయినప్పటి నుంచీ హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే హిమాచల్‌ ప్రదేశ్‌ భారీ వర్షాలు వరదల నుంచి కోలుకోలేదు. ఎంతో సుందరంగా, అందంగా ఉండే హిమాచల్‌ ప్రదేశ్‌ ఇప్పుడు వరదలతో సర్వనాశనం అయింది. నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండే రాష్ట్రం కాస్త .. ఎవరైనా రావాలంటే భయపడుతున్న పరిస్థితి నెలకొనగా.. రాష్ట్రంలో ఉన్న ప్రజలు సైతం భారీ వర్షాలు, వరదల మూలంగా బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు. రాష్ట్రంలో వర్సాలు ఇంకా కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ రోజు కూడా వర్షాల కారణంగా ఎల్లో అలర్ట్ జారీ చేయగా.. 22 నుంచి 24 వరకు భారీ వర్షాలు కురవనుండటంతో ఆరెంజ్‌ అలర్ట్ ను భారత వాతావరణ కేంద్రం జారీ చేసింది. ప్రస్తుతం కోల్‌దామ్‌ రిజర్వాయర్‌లో 10 మంది చిక్కుకున్నారని వారు సురక్షితంగా ఉన్నారా? లేరా? అని తెలుసుకోవడానికి రెస్క్యూ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కుండపోత వర్షాలతో అతలాకుతలమైన హిమాచల్‌ప్రదేశ్‌కు మరో ముప్పు పొంచి ఉన్నది. భారీ వర్షాలతో ఛంబా, మండి జిల్లాలను ఆకస్మిక వరదలు ముంచెత్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. వర్షాల వల్ల కొండ చరియలు విరిపడుతాయని, నదులు, వాగుల్లో నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం కురిసిన భారీ వర్షాల వల్ల మనాలిలోని కోల్‌ దామ్‌ రిజర్వాయర్‌లో 10 మంది చిక్కుకుపోయారు. వారిలో ఐదుగురు అటవీ సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు.

Read also: Rinku Singh: అక్కడుంది రింకూ సింగ్.. ఐపీఎల్ అయినా, అంతర్జాతీయ క్రికెట్ అయినా బాదుడు మాత్రం సేమ్!

కోల్‌దామ్‌ రిజర్వాయర్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రిజర్వాయర్‌లో చిక్కకున్న వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టామని, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారని మండీ డిప్యూటీ కమిషనర్‌ అరిందమ్‌ చౌధరీ వెల్లడించారు. జలాశయంలో ఒక్కసారిగా నీటిమట్టం పెరగడంతో బోటులో వెళ్లిన పదిమంది కోల్‌ దామ్‌లోనే చిక్కుకుపోయారని చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతున్నదని తెలిపారు. రాష్ట్రంలో జూన్‌ 24 నుంచి కురుస్తున్న భారీ వర్షాల మూలంగా ఇప్పటి వరకు రూ.8014.61 కోట్ల మేర నష్టం వాటిళ్లినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,022 ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని.. మరో 9615 ఇండ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయని తెలిపింది. ఈ ఏడాది వర్షాకాలంలో 113 కొండ చరియలు విరిగిపడ్డాయని పేర్కొంది. వర్షాల వల్ల ఇప్పటివరకు 224 మంది ప్రాణాలు కోల్పోయారని.. మరో 117 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని ప్రభుత్వం ప్రకటించింది.