Heavy Rains Across India: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశాల తీరాలను అనుకుని పశ్చిమ- వాయువ్య బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడింది. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్రల మధ్య అల్పపీడనం కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఒడిశా, ఏపీ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కోస్తా ఆంధ్రాప్రదేశ్, యానాం, తెలంగాణ, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఈ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 5 రోజుల్లో గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల్లో పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఏపీల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకర్, కేరల, మహేలతో విస్తారంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కువనున్నాయి. చత్తీస్ ఘడ్, మరాఠ్వాడా, విదర్భ, గుజరాత్, కొంకణ్, గోవాలలో వర్షపాతం నమోదు అవనున్నట్లు ఐఎండీ వెల్లడించింది.
Read Also: RebelStar Krishnam Raju: టాలీవుడ్ లో విషాదం…రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు
గుజరాత్ ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మంగళవారం గుజరాత్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ. ఈ నెల 10,11 తేదీల్లో ఒడిశాలో భారీ వర్షాలు కురువనున్నాయి. 11,12 తేదీల్లో గంగా నది పరివాహక ప్రాంత, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి. 11 నుంచి 14 వరకు మహారాష్ట్రలో, 12-14 తేదీల్లో గుజరాత్ ప్రాంతంలో, రానున్న 5 రోజుల్లో కొంకణ్, గోవా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. సెప్టెంబర్ 10-11 తేదీల్లో వాయువ్య, పశ్చిమ బంగాళాఖాతం, ఏపీ, ఒడిశా, వెస్ట్ బెంగాల్ తీరాల వెంబడి పరిస్థితి అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. సెప్టెంబర్ 10,11 తేదీల్లో బంగాళాఖాతం తీరాలకు వెళ్లవద్దని సూచించింది.