Israeli Airstrike On Rafah: దక్షిణ గాజా నగరమైన రఫాలోని శరణార్థి శిబిరంపై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేయడంతో పసిపిల్లలతో పాటు 45 మంది మరణించారు. యావత్ ప్రపంచం ఈ దాడిని ఖండించింది. ‘‘ఆల్ ఐస్ ఆన్ రఫా’’ పేరుతో సోషల్ మీడియాలో పలు దేశాల ప్రముఖులు, క్రీడాకారులు కామెంట్స్ చేశారు. మే 26న జరిగిన వైమానిక దాడి ఘటనను వెస్ట్రన్ దేశాలతో పాటు అమెరికా కూడా ఖండించింది.
ఈ దాడిపై తొలిసారిగా భారత్ స్పందించింది. ఇజ్రాయిల్ జరిపిన దాడిలో పౌరుల ప్రాణాలు కోల్పోవడం ‘‘హృదయ విదారకమైనది’’గా భారత్ ఈ రోజు పేర్కొంది. కొనసాగుతున్న సంఘర్షణలో అంతర్జాతీయ మానవతా చట్టాలను గౌరవించాలని పిలుపునిచ్చింది. ‘‘రఫాలోని శరణార్థి శిబిరంలో హృదయవిదారకంగా పౌరులు ప్రాణాలు కోల్పోవడం మాకు తీవ్ర ఆందోళన కలిగించే విషయం’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ అన్నారు. పౌర జనాభాకు రక్షణ,అంతర్జాతీయ మానవతా చట్టాలను గౌరవించాలని భారత్ పిలుపునిస్తున్నట్లు చెప్పారు.
Read Also: Dinesh Karthik: క్రికెట్ కు గుడ్ బై చెప్పి.. జావెలిన్ త్రో చేస్తున్న దినేష్ కార్తీక్..
ఇజ్రాయిల్ దీనిని బాధకరమైన సంఘటనగా అంగీకరించిందని, సంఘటనపై దర్యాప్తు ప్రకటించిందని తాము గమనించామని జైశ్వాల్ చెప్పారు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో స్పెయిన్, ఐర్లాండ్, నార్వేలు పాలస్తీనా దేశాన్ని గుర్తించడంపై మాట్లాడుతూ.. భారత్ ఈ పనిని 1980లోనే చేసిందని జైశ్వాల్ అన్నారు. పాలస్తీనా వివాదానికి రెండు-దేశాల పరిష్కారానికి భారత్ మద్దతు ఇచ్చిందని, ఇజ్రాయిల్-పాలస్తీనా శాంతియుతంగా కలిసి ఉండాలనేదే భారత్ వైఖరిగా చెప్పారు.
గతేడాది అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని హతమార్చగా, 240 మందిని బందీలుగా కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ పాలస్తీనాలో అంతర్భాగంగా ఉన్న గాజా స్ట్రిప్‌పై విరుచుకుపడుతోంది. ఈ దాడిలో హమాస్ ఉగ్రవాదులతో సహా పాలస్తీనాకు చెందిన అమాయకపు ప్రజలు మరణిస్తున్నారు. హమాస్ అధికారులు చెబుతున్న దాని ప్రకారం, ఇప్పటి వరకు 36 వేల మంది మరణించారు. మరోవైపు హమాస్ పూర్తిగా అంతం చేసి, బందీలను విడిపించే వరకు యుద్ధాన్ని ఆపేది లేదని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది.