NTV Telugu Site icon

Mahua Moitra: చిక్కుల్లో ఎంపీ మహువా మోయిత్రా.. వివాదానికి దూరంగా తృణమూల్..

Mahua Moitra

Mahua Moitra

Mahua Moitra: పార్లమెంట్‌లో ప్రశ్నలు అడగటానికి లంచం తీసుకున్నారనే ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా. అదానీ గ్రూపుపై పార్లమెంట్ లో ప్రశ్నలు లేవనెత్తడానికి వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ జరపాలని ఇప్పటికే లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు. దీంతో పాటు ఎంపీగా ఉన్న మోయిత్రా తన లోక్ సభ లాగిన్ ఐడీని ఇతరులకు ఇచ్చినట్లు ఆరోపణలు చేస్తే కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కి కూడా లేఖ రాశారు.

ఈ నేపథ్యంలో తాజాగా వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ సంతకం చేసిన అఫిడవిట్ ను పార్లమెంట్ ఎథిక్స్ కమిటికీ పంపడం ఈ కేసులో సంచలనంగా మారింది. ప్రధాని మోడీని టార్గెట్ చేసుకుని విమర్శించేందుకు అదానీ గ్రూపుపై ప్రశ్నలు అడిగిందని, తనతో చేయకూడని పనులు చేయించిందని, విలువైన గిఫ్టులను తీసుకునేదని లేఖలో ఆరోపించాడు.

Read Also: Big Car Key: కారు కొనుగోలు చేసినప్పుడు పెద్ద “కీ” ఎందుకు ఇస్తారో తెలుసా..?

ఇదిలా ఉంటే ఈ వివాదంలో కలుగజేసుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నిరాకరిస్తోంది. పార్టీ ఎంపీ అయిన మహువా మోయిత్రాకు మద్దతు ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఈ వివాదానికి దూరంగా ఉండటమే మంచిదని టీఎంసీ భావిస్తోంది. ఈ అంశంపై పార్టీ చెప్పేదేం లేదని, ఈ వివాదం ఎవరి చుట్టూ తిరుగుతుందో వారే స్పందిస్తారని టీఎంసీ పశ్చిమబెంగాల్ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ అన్నారు. టీఎంసీ మరో నాయకుడు మాట్లాడుతూ.. ఈ వివాదంలోకి రావడానికి పార్టీ ఇష్టపడటం లేదని అన్నారు.

ఈ పరిణామాలపై ప్రతిపక్ష బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టీఎంసీ లీడర్లు అరెస్టు అయిన సందర్భాల్లో టీఎంసీ తన బాధ్యతల నుంచి తప్పించుకుంటోందని, మహువా మోయిత్రాకు మద్దతిస్తుందా..? లేదా..? అనేది టీఎంసీ వివరించాలని బీజేపీ నేత రాహుల్ సిన్హా అన్నారు