దేశంలో మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ ఒకెత్తు అయితే వయనాడ్ బైపోల్ మాత్రం రసవత్తరంగా మారింది. ఇక్కడ తొలిసారి ప్రియాంకాగాంధీ రాజకీయాల్లోకి ప్రవేశించి పోటీ చేయడమే కారణం. దీంతో వయనాడ్ దేశ వ్యాప్తంగా ఫోకస్ అవుతోంది. ఇక బుధవారం భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లి ప్రియాంక నామినేషన్ వేయనున్నారు. ఆమె వెంట తల్లి సోనియా, సోదరుడు రాహుల్ గాంధీ, భర్త రాబర్ట్ వాద్రా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఉండనున్నారు.
ఇదిలా ఉంటే ప్రియాంకపై బీజేపీ కూడా గట్టి అభ్యర్థినే రంగంలోకి దింపింది. నవ్య హరిదాస్ అనే కౌన్సిలర్‌ను బరిలోకి దింపింది. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాతో ఆమె మాట్లాడింది. ప్రజాప్రతినిధిగా ప్రియాంక కంటే తనకే ఎక్కువ రాజకీయ జీవితం ఉందని, ఈ ఎన్నికల్లో తనదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
ప్రియాంకకు నెహ్రూ కుటుంబ నేపథ్యం ఉన్నందున జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందన్నారు. కానీ ఇది ఆమెకు తొలి ఎన్నిక అని చెప్పారు. మరోవైపు కొయ్‌కోడ్ కౌన్సిలర్‌గా వరుసగా రెండుసార్లు పనిచేశానని. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసినట్లు నవ్య తెలిపింది. ఎన్నో ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్నందున.. ప్రియాంకపై పోటీ చేయడం భిన్నంగా ఏమీ అనిపించడం లేదన్నారు. ఆమె కంటే నాకే ఎక్కువ రాజకీయ అనుభవం ఉందని భావిస్తున్నట్లు నవ్య హరిదాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ బాధ్యతారాహిత్యం వల్ల ఈ ఎన్నిక అనివార్యమైందని, సోదరి కోసం వయనాడ్‌ను రాహుల్ వదిలేశారని విమర్శించారు. కుటుంబ ఆధిపత్యానికి ఇదో ఉదాహరణ అని.. ఇదే అంశాన్ని ఓటర్ల ముందుకు తీసుకెళ్తానని నవ్య చెప్పుకొచ్చారు.
గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి భారీ విజయంతో గెలుపొందారు. కుటుంబానికి కంచుకోట అయిన రాయ్‌బరేలీ స్థానాన్ని ఉంచుకుని వయనాడ్‌ను వదులుకున్నారు. దీంతో వయనాడ్‌లో బైపోల్ వచ్చింది. ముందుగానే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే.. వయనాడ్‌లో ప్రియాంక పోటీ చేస్తుందని ప్రకటించారు. అన్నట్టుగానే ఆమె పేరును ప్రకటించారు. ఇక నవంబర్ 13న వయనాడ్‌లో ఉపఎన్నిక జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి.