Hathras Stampede: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మంగళవారం యూపీలోని హత్రాస్ జిల్లా ఫూల్ రాయ్ గ్రామం దగ్గర నిర్వహించిన భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో ఈ పెను విషాదం జరిగింది. వేలాది మంది హాజరైన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తీవ్రమైన రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలాటలో దాదాపు 116 మంది మరణించారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉండగా.. 108 మంది మహిళలు ఉన్నారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు.
అయితే, ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే బాబా వెళ్లిపోతుండగా ఆయనతో ఫొటో దిగేందుకు.. ఆయన కాళ్లు మొక్కేందుకు జనం ఎగబడ్డారు.. అలాగే, బురద వల్ల నేలపై కొందరు జారిపడటంతో తొక్కిసలాట స్టార్ట్ అయింది అని చెప్తున్నారు. కాగా, తొక్కిసలాటలో మరణించిన 89 మంది డెడ్ బాడీలను హత్రాస్ లోని ఆస్పత్రిలో ఉంచామని ఎస్పీ రాజేశ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. అలాగే, ఎటాలోని జిల్లా ఆస్పత్రికి 27 మంది డెడ్ బాడీలను తరలించామన్నారు. ఇప్పటి వరకు మృతుల్లో 72 మందిని గుర్తించామని పోలీసులు వెల్లడించారు.
కాగా, తొక్కిసలాట ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున నష్ట పరిహారం అందిస్తామన్నారు. సంఘటన ప్రదేశానికి వెళ్లి యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరు రాష్ట్ర మంత్రులు, సీఎస్, డీజీపీని కూడా ఘటన జరిగిన ప్రదేశంలోనే ఉండి పరిస్థితి సమీక్షించాలని చెప్పారు. తొక్కిసలాట జరిగిన ఘటనపై యూపీ సర్కార్ ఓ కమిటిని వేసింది. అలాగే, ఇవాళ ( బుధవారం ) రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హత్రాస్ జిల్లాలోని ఫూల్ రాయ్ గ్రామానికి వెళ్లి పరిస్థితిని దగ్గరుండి సమీక్షించనున్నారు. దీంతో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.