Shiv Sena: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి సత్తాచాటుతోంది. బీజేపీ+శివసేన(షిండే)+ ఎన్సీపీ(అజిత్ పవార్)ల ‘‘మహయుతి’’ కూటమి సంచలన విజయం సాధిస్తోంది. మొత్తం 288 స్థానాల్లో మహాయుతి కూటమి ఏకంగా 219 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్+ఠాక్రే సేన+శరద్ పవార్ ఎన్సీపీల ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ కూటమి కేవలం 55 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
Read Also: Bandi Sanjay: మానేరు వాగుపై నూతన బ్రిడ్జి ని ప్రారంభించనున్న బండి సంజయ్..
అయితే, ఈ ఎన్నికల్లో నిజమైన శివసేన ఏదనే విషయంలో మరాఠీ ప్రజలు స్పష్టం తీర్పును వెల్లడించారు. బాలాసాహెబ్ ఠాక్రే వారసుడు ఏక్‌నాథ్ షిండే అని మహా ఓటర్లు చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఈ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. షిండే శివసేన 81 స్థానాల్లో పోటీచేస్తే 53 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక ఉద్ధవ్ ఠాక్రే సేన 95 స్థానాల్లో పోటీ చేస్తే, కేవలం 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. దీనిని బట్టి చూస్తే నిజమైన శివసేన షిండేదే అని మహారాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చారు.
ఏక్‌నాథ్ షిండే శివసేనలో తిరుగుబాటు చేయడంతో 2022లో శివసేన రెండుగా విడిపోయింది. షిండే, తన పాత మిత్రుడు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వాన్ని నడిపించారు. తాజాగా వచ్చిన ఫలితాల్లో షిండే తన సత్తా చాటారు. నిజమైన శివసేన తనదే అని నిరూపించారు. తనను షిండే వెన్నుపోటు పొడిచాడని ఉద్ధవ్ ఠాక్రే సెంటిమెంట్ రాజేసినప్పటికీ, మహారాష్ట్ర ఓటర్లు మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో షిండే వైపే నిలిచారు.