Har Ghar Tiranga: హర్ ఘర్ తిరంగా వెబ్‌సైట్(www.harghartiranga.com)లో నిన్న సోమవారం సాయంత్రం 4 గంటల వరకు 5 కోట్లకు పైగా సెల్ఫీలు అప్‌లోడ్ అయినట్లు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీన్ని ‘అద్భుత విజయం’గా అభివర్ణించింది. దేశ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోనున్న ఈ కార్యక్రమంలో దేశ, విదేశాల నుంచి పాల్గొన్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. జాతీయ పతాకాన్ని ప్రతి ఇంటి పైన, పని ప్రదేశంలో ఎగరేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీ గత నెల 22వ తేదీన దేశ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
మువ్వన్నెల జెండా దగ్గర నిలబడి సెల్ఫీ తీసుకొని హర్ ఘర్ తిరంగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని కూడా ఆయన సూచించారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ పిలుపునిచ్చారు. ఇండియా నిన్న 76వ ఇండిపెండెన్స్ డేని ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. దీంతో ‘2022 ఆగస్టు 15’ కోసం ప్రారంభమైన 75 వారాల కౌంట్‌డౌన్ విజయవంతంగా ముగిసింది. 2021 మార్చి 12న మొదలైన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 2023 ఆగస్టు 15 వరకు కొనసాగనుంది.
Mahatma Gandhi NREGS: ‘మహాత్మాగాంధీ’ని కాదని.. మరో ‘ఉపాధి’.
శత స్వాతంత్ర్య దినోత్సవం (2047) వరకు అంటే మరో పాతికేళ్లపాటు (అమృత కాలంలో) మహోన్నతంగా సాగే దేశ నిర్మాణంలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని, దీనికి సూచికగా హర్ ఘర్ తిరంగా ప్రచారంలో పాలుపంచుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. భారతదేశ పౌరులందరిలో మూడు రంగుల జెండా పట్ల వ్యక్తిగత, భావోద్వేగ అనుబంధాన్ని పెంచటం కోసం ఈ ఇనీషియేటివ్‌కి శ్రీకారం చుట్టింది. సెల్ఫీల అప్‌లోడ్ ప్రోగ్రామ్ ఓ మైలురాయిగా నిలిచిపోవటంపై కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
‘నేషన్ ఫస్ట్ అండ్ ఆల్వేస్ ఫస్ట్’ అనే భావన దిశగా ప్రజలు అంకితభావాన్ని ప్రదర్శించారని తెలిపారు. మాతృ భూమిపై ప్రేమను చాటేందుకు భరతమాత బిడ్డలంతా ఐక్యంగా ముందుకు కదిలారని పేర్కొన్నారు. దేశభక్తి ప్రదర్శన, త్రివర్ణ పతాకంపై అవగాహనను పెంపొందించడంలో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని డిజిటల్ రూపంలోనూ ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేసింది. ‘పిన్ ఏ ఫ్లాగ్’కు పర్మిషన్ ఇచ్చింది.
దీంతో పాన్ ఇండియాలోనే కాకుండా గ్లోబల్‌గా ఉన్న ఇండియన్లు 5 కోట్లకు పైగా ఫ్లాగ్‌లను పిన్ చేశారు. ఇదిలాఉండగా.. మన దేశంలో గతంలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే జాతీయ పతకాన్ని ఎగరేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించేది. ఈ కట్టుబాటును ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీంతో దేశ అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) పరిధిలో జాతీయ పతక గౌరవానికి, ప్రతిష్టకు ఏమాత్రం భంగం కలగకుండా పౌరులు స్వేచ్ఛగా ఎగరేసేందుకు పచ్చ’జెండా’ ఊపింది.
ఇది ప్రతి భారతీయ పౌరుడి ప్రాథమిక హక్కు అని పేర్కొంటూ ఈ అరుదైన తీర్పును 2004 జనవరి 23వ తేదీన వెలువరించింది. ఈ నేపథ్యంలో.. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నవీన్ జిందాల్ స్వాగతించారు. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోడీని మెచ్చుకున్నారు. దేశ ప్రజలందరూ హర్ ఘర్ తిరంగా మాదిరిగానే హర్ దిన్ తిరంగా అనే నినాదం అందుకోవాలని కోరారు.