Site icon NTV Telugu

Gyanvapi Mosque case: జ్ఞానవాపి కేసుపై సుప్రీంలో విచారణ.. కీలక ఆదేశాలిచ్చిన కోర్టు

Gnanavapi Mosque

Gnanavapi Mosque

Supreme Court On Gyanvapi Mosque case: జ్ఞానవాపి మసీదు కేసులో ఈ రోజు సుప్రీం కోర్టు విచారించింది. అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ దాఖలు చేసిన అప్పీల్ ను అక్టోబర్ మొదటివారానికి వాయిదా వేస్తూ గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు హిందూ మహిళలు వేసిన పిటిషన్ పై కూడా విచారణ జరిపింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, సూర్యకాంత్, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం జ్ఞానవాపి మసీదు కేసును విచారించింది. ప్రస్తుతం ఈ కేసు వారణాసి కోర్టులో విచారణ జరుగుతుందని.. కోర్టు నిర్ణయం వచ్చే వరకు వేచి చూస్తామని కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇదిలా ఉంటే మసీదులో బయటపడిన శివలింగానికి జలాభిషేకం చేయడానికి అనుమతి ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ స్వీకరించడానికి నిరాకరించింది. ఈ కేసు ఇప్పటికే వారణాసి కోర్టులో పెండింగ్ లో ఉన్న కారణంగా కొత్తగా దావాను తీసుకోలేమని వెల్లడించింది. శ్రావణ మాసం ప్రారంభం అవుతున్న క్రమంలో హిందువులు పూజలు చేసుకోవడానికి అనుమతివ్వాలని పిటిషన్ దాఖలు అయింది.. అయితే దీన్ని కోర్టు విచారించేందుకు నిరాకరించింది. దీంతో పాటు మసీదులో కనుకున్న శివలింగాన్ని కార్బన్ డేటింగ్ చేయడంతో పాటు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సర్వే కోరుతూ ఏడుగురు మహిళలు దాఖలు చేసిన మరో పిటిషన్ స్వీకరించడానికి కూడా సుప్రీం కోర్టు నిరాకరించింది.

Read aAlso: National Herald Case: ముగిసిన సోనియాగాంధీ తొలి రోజు విచారణ..75 మంది కాంగ్రెస్ ఎంపీల అరెస్ట్

గతంలో అలహాబాద్ హైకోర్టు జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫీ సర్వేకు అనుమతించింది. ఆ సమయంలోనే మసీదులోని వాజూఖానాలోని ఒక బావిలో శివలింగం వంటి ఆకారం బయటపడటంతో పాటు మసీదులో గోడలపై పలు రకాల హిందు చిహ్నాలు కనిపించాయి. అయితే ఈ వీడియోగ్రఫీ సర్వేను ఛాలెంజ్ చేస్తే అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీం కోర్టులను ఆశ్రయించింది. మే 17ను సుప్రీం కోర్టు ఈ వివాదంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శివలింగం కనుగొనబడిన ప్రాంతాన్ని రక్షించడంతో పాటు నమాజ్ కో్సం ముస్లింలకు ప్రవేశాన్ని కల్పించాలని ఆదేశించింది. మే 20న ఈ కేసును వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేసింది.

Exit mobile version