జ్ఞానవాపి మసీదు వివాదం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇటీవల వారణాసి కోర్ట్ వీడియో సర్వేకు ఆదేశాలు ఇవ్వడంతో ఈ నెల 14-16 వరకు సర్వే జరిగింది. మసీదులోని వాజుఖానా ప్రదేశంలోని కొలనులో శివలింగం బయటపడిందనే వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే జ్ఞానవాపి మసీదు సర్వేను నిలిపివేయాలంటూ… అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంను ఆశ్రయించింది. ఇటీవల సుప్రీం కోర్ట్ ఈ వివాదంపై విచారణ జరిపింది. శివలింగం బయటపడిన ప్రాంతానికి రక్షణ కల్పించడంతో పాటు ముస్లింలు ప్రార్థన చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే విధంగా ఈ కేసును వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేసింది.
ఇదిలా ఉంటే నిన్నఈ వివాదంపై వారణాసి కోర్ట్ విచారణ జరిపింది. కోర్ట్ తన నిర్ణయాన్ని మంగళవారానికి వాయిదా వేసింది. వారణాసి కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ విశ్వేషా ఈ వివాదంపై విచారణ జరిపారు. సోమవారం ఇరు పక్షాలు తమ వాదలను వినిపించాయి. కోర్ట్ విచారణ సందర్భంగా 19 మంది న్యాయమూర్తులు, నలుగురు పిటిషన్ దారులను మాత్రమే కోర్ట్ లోకి అనుమతించింది.
కాగా న్యాయమూర్తి తీర్పును మంగళవారానికి రిజర్వ్ చేశారు. కోర్ట్ రెండు వర్గాల పిటిషన్ లలో దేనిని విచారించాలనే దానిపై నేడు నిర్ణయం తీసుకోనుంది. వీడియో సర్వేను వ్యతిరేఖిస్తూ హిందు వర్గాలు వేసిన పిటిషన్ ను ఛాలెంజ్ చేసిన అంజుమన్ ఇంతే జామియా మసీదు పిటిషన్ ఓ వైపు, మరో వైపు తమ ప్రార్థనలకు అనుమతి ఇవ్వాలని హిందూ మహిళల పిటిషన్ మరో వైపు ఈ రెండింటిలో దేన్ని విచారించాలనే దానిపై కోర్ట్ నిర్ణయం తీసుకోనుంది. తాజాగా ఈ రోజు వారణాసి కోర్ట్ జ్ఞానవాపి మసీదు వివాదంపై కీలక తీర్పు వెల్లడించంనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కోర్ట్ తీర్పును వెల్లడించనుంది. దీంతో ఎలాంటి తీర్పు వస్తుందో అని దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
