Gurugram Road Rage: గురుగ్రామ్ రోడ్లపై తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఓ మహిళా బైకర్ సోషల్ మీడియాలో వెల్లడించారు. తనకు దూరంగా ఉండాలని కారులో ఉన్నవారిని కోరిన తర్వాత.. వారు తనను వెంబడించి, చివరకు తన స్పోర్ట్స్ బైక్‌ను కారుతో ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యారని ఆమె ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గురుగ్రామ్‌కు చెందిన సియా అనే మహిళ ‘rebelwheels_sia_’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో బైకింగ్‌కు సంబంధించిన కంటెంట్‌ను పోస్ట్ చేస్తుంటారు. ఆదివారం ఆమె తన బైకింగ్ గ్రూప్ సభ్యులతో కలిసి గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై Aprilia RS 457 స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.
కారులోని వ్యక్తులు వెంటాడారని ఆరోపణ
సియా తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచే ఓ కారులోని వ్యక్తులు తనను వెంబడిస్తున్నారని ఆరోపించారు. కారు తనకు దగ్గరగా రావడంతో, కొంత దూరం పాటించాలని ఆమె కోరినట్లు చెప్పారు. అయితే కారులో ఉన్నవారు తన బైక్‌ను ఆపాలని చెప్పారని, వారి ప్రవర్తన కూడా దురుసుగా ఉందని సియా పేర్కొన్నారు. వారు మద్యం సేవించి ఉన్నట్లు తనకు అనిపించిందని ఆమె ఆరోపించారు. కారు తన బైక్‌ను అడ్డుకోకుండా ఉండేందుకు తాను ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించానని తెలిపారు. అదే సమయంలో వెనుక వస్తున్న తన స్నేహితుడు కూడా కారును తనకు దగ్గరకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించాడని చెప్పారు.
బైక్‌ను ఢీకొట్టి పరారీ
కారు తనను కొంత దూరం వరకు వెంబడించిన అనంతరం.. డ్రైవర్ తన బైక్‌కు అడ్డంగా కారు నడిపేందుకు ప్రయత్నించాడని సియా ఆరోపించారు. ఈ క్రమంలో కారు తన స్పోర్ట్స్ బైక్‌ను ఢీకొట్టిందని తెలిపారు. కారు ఢీకొట్టడంతో తాను బైక్‌పై నుంచి రోడ్డుపై పడిపోయినట్లు చెప్పారు. మరోవైపు ఆమె బైక్ కొన్ని మీటర్ల దూరం వరకు కారుతో పాటు ఈడ్చుకెళ్లినట్లు పేర్కొన్నారు. ప్రమాదం అనంతరం కారు అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయిందని తెలిపారు. ఈ మొత్తం ఘటన తన బైక్‌కు అమర్చిన యాక్షన్ కెమెరాలో రికార్డయిందని సియా వెల్లడించారు.
డ్రైవర్‌ను ఆపేందుకు స్నేహితుడి ప్రయత్నం
ప్రమాదం తర్వాత సియా స్నేహితుల్లో ఒకరు కారును వెంబడించి డ్రైవర్‌ను ఆపేందుకు ప్రయత్నించినట్లు ఆమె తెలిపారు. ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆగడంతో, తన స్నేహితుడు డ్రైవర్‌ను ప్రశ్నించాడని చెప్పారు. ప్రమాదానికి డ్రైవర్‌దే తప్పని చెప్పినప్పటికీ.. అతను బాధ్యతను అంగీకరించలేదని, అనంతరం అక్కడి నుంచి కారుతో వెళ్లిపోయాడని సియా ఆరోపించారు.
గురుగ్రామ్ పోలీసులకు సియా విజ్ఞప్తి
ఇలాంటి విధంగా ఇతర రోడ్డు వినియోగదారుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని సియా గురుగ్రామ్ పోలీసులను కోరారు. ప్రమాదం చేసి ఆగకుండా వెళ్లిపోయే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన వీడియోలో సంబంధిత వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌తో పాటు ఆ వాహనం ఆర్‌సీ యజమాని పేరును కూడా ఆమె ప్రస్తావించారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా వీడియో
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పలువురు నెటిజన్లు సియాకు మద్దతుగా నిలిచారు. ఢిల్లీ పోలీస్, గురుగ్రామ్ పోలీస్, గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీస్, హర్యానా పోలీసులను ట్యాగ్ చేస్తూ.. ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పలువురు డిమాండ్ చేశారు. గురుగ్రామ్ రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్, రోడ్డు భద్రతపై కూడా నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు అధికారికంగా తీసుకున్న చర్యలకు సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.
.@GurgaonPolice, please investigate this incident and take appropriate legal action against the driver if the allegations are substantiated.
Car No.: HR 30Y 4949
📹: IG/rebelwheels_sia_ pic.twitter.com/U3IuV8d0j4
— Anahita Rathore (@StormofRealm) September 14, 2026

