Punjab: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణమం చోటుచేసుకుంది. నాభా జైలు నుంచి పారిపోయిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గ్యాంగ్ స్టర్ గురుప్రీత్ సింగ్ సేఖోన్ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరారు. ఫిరోజ్‌పూర్ జిల్లాలోని జీరాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సమక్షంలో పార్టీలో చేరారు. సేఖోన్ రాబోయే ఎన్నికల్లో జీరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సేఖోన్ చేరితో ఆప్ జీరా సిట్టింగ్ ఎమ్మెల్యే నరేష్ కటారియా వర్గంలో చర్చ మొదలైంది.
2016లో నాభా జైలు ఘటన దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. 2016 నవంబర్ 27న నాభా జైలు నుంచి ఆరుగురు ఖైదీలు తప్పించుకున్న కేసులో సేఖోన్ కీలక నిందితుడిగా ఉన్నారు. మళ్లీ ఇతడిని 2017 ఫిబ్రవరిలో మోగా జిల్లాలోని ధుడికే గ్రామంలో పోలీసులు పట్టుకున్నారు. ఇతడిపై హత్యా, హత్యాయత్నం సహా అనేక కేసులు ఉన్నాయి. సేఖోన్ తన ప్రాంతంలో స్థానిక రాజకీయాల్లో యాక్టివ్‌గా మారారు. కొన్ని నెలల క్రితం జిల్లా పరిషత్, బ్లాక్ సమితి ఎన్నికల్లో తన ఇద్దరు బంధువులను ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేయించి, విజయం సాధించారు.
జీరా అసెంబ్లీ నియోజకవర్గం గతంలో శిరోమణి అకాలీ దళ్‌కు బలమైన ప్రాంతంగా ఉండేది. మాజీ ఎమ్మెల్యే హరి సింగ్ జీరా మరణం తర్వాత ఆ పార్టీ ప్రభావం తగ్గింది. 2017లో కాంగ్రెస్‌కు చెందిన కుల్బీర్ సింగ్ జీరా గెలుపొందగా, 2022లో ఆప్‌కు చెందిన నరేశ్ కటారియా విజయం సాధించారు. ఇప్పుడు సెఖోన్ ఆప్‌లో చేరడంతో ఆ నియోజకవర్గంలో సమీకరణాలు మారిపోనున్నాయి.

