ప్రధాని మోడీ శుక్రవారం గుజరాత్‌లో పర్యటించారు. అయితే ముందుగా గురువారం సూరత్‌లో మోడీ కాన్వాయ్ రిహార్సల్ చేసింది. ఆ సమయంలో హఠాత్తుగా ఓ బాలుడు(17) సైకిల్ తొక్కుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు. దీన్ని గమనించిన పోలీసు సబ్-ఇన్స్పెక్టర్ వెంటనే సైక్లింగ్ చేస్తున్న బాలుడిని అడ్డుకుని చితకబాదాడు. తల మీద, ముఖంపై పిడుగుద్దుల వర్షం కురిపించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గురువారం సూరత్‌లోని రతన్ చౌక్ దగ్గర మోడీ కాన్వాయ్ రిహార్సల్ జరుగుతున్నాయి. 17 ఏళ్ల బాలుడు సైకిల్ తొక్కుతున్నాడు. అక్కడే ఉన్న పోలీస్ అధికారి బీఎస్ గధ్వి.. బాలుడిని నిలువరించి చెంపదెబ్బకొట్టాడు. పిడుగుద్దులు కురిపించాడు. అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్‌కు తరలించి.. రాత్రి వరకు స్టేషన్‌లో కూర్చోబెట్టారు. బిడ్డ ఏమయ్యాడో తెలియక.. తల్లిదండ్రులు అల్లాడిపోయారు. రాత్రి 9:30 గంటలకు బాలుడు ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. జరిగిన విషయం చెప్పడంతో పోలీసుల తీరుపై తల్లిదండ్రులు మండిపడ్డారు. ఏదైనా తప్పు చేస్తే కౌన్సెలింగ్ ఇచ్చో.. లేదంటే మందలించి పంపించాలి కానీ.. రాత్రి వరకు స్టేషన్‌లో కూర్చోబెట్టడమేంటి? అని నిలదీశారు.
అయితే ఈ ఘటనపై స్థానిక నివాసులు మండిపడ్డారు. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అమిత వనాని స్పందిస్తూ.. జరిగిన తీరును ఖండించారు. పోలీస్ అధికారి గధ్వి ప్రవర్తన అనుచితంగా ఉందని… దీనికి చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. మోర్బి జిల్లాలోని ఒక పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న గధ్విని తక్షణమే కంట్రోల్ రూమ్‌కు బదిలీ చేసినట్లు డీసీపీ తెలిపారు. అంతేకాకుండా పెరిగిన జీతాన్ని ఒక ఏడాది పాటు నిలిపివేసినట్లు తెలిపారు.