GPS: ఇటీవల కాలంలో జీపీఎస్ గూగుల్ మ్యాప్స్ నమ్మి కొన్ని సార్లు ప్రమాదాలు కొన్ని తెచ్చుకుంటున్నారు వాహనదారులు. కొన్ని సందర్భాల్లో తప్పుడు రూట్లలోకి తీసుకెళ్లడం మూలంగా కొందరు ప్రయాణికులు ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ ఘటన ప్రతీ సారి జీపీఎస్‌ని నమ్మడం ఎంత ప్రమాదమో తెలియజేస్తోంది. గమ్యస్థానాన్ని చేరుకోవడానికి జీపీఎస్‌ని వినియోగించిన ఇద్దరు సోదరులతో సహా ముగ్గురు మరణించారు.
Read Also: Sanjay Raut: సంజయ్ రౌత్.. 3 పార్టీలను ముంచాడు.. ముఖ్యంగా ఠాక్రేని..
బదౌన్ జిల్లాలోని బరేలీ నుంచి డేటా గంజ్‌కి వెళ్తున్న కారు జీపీఎస్‌ని నమ్మి బ్రిడ్జ్‌పై నుంచి 50 అడుగుల దిగువన నదిలో పడిపోయింది. ఈ ఘటన ఫరీద్‌పూర్ సమీపంలో జరిగింది. వంతెన పాడైపోవడం గురించి తెలియక కారుని వంతెన మీద నుంచి పోనిచ్చారు. గ్రామస్థులు గమనించి పాడైపోయిన వ్యాగన్‌ఆర్‌ను రామగంగా నది నుంచి బయటకు తీశారు. కారులో ఉన్న ఇద్దరు సోదరులతో సహా మరొకరు మొత్తం ముగ్గురు అప్పటికే మరణించి ఉన్నారు. ఇద్దరు ప్రయాణికులను ఫరూఖాబాద్‌కు చెందిన వివేక్‌కుమార్, అమిత్‌గా గుర్తించారు. మూడో బాధితుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో వరదల కారణంగా వంతెన ముందు భాగం నదిలో కూలిపోయింది. ఈ విషయాన్ని జీపీఎస్‌లో అప్డేట్ చేయలేదు. దీంతో కారును తెలియక ఇదే మార్గం గుండా పోనిచ్చారు. ప్రమాదానికి గురై ముగ్గురు మరణించారు. బాధితులు గూగుల్ మ్యాప్స్‌పైనే ఆధారపడుతున్నారని, వంతెన అసంపూర్తిగా ఉండడంతో పాటు వచ్చే వాహనాలను అప్రమత్తం చేసేందుకు చుట్టుపక్కల బారికేడింగ్ లేకపోవడంపై బాధితుల కుటుంబ సభ్యులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా మెజిస్ట్రేట్‌ను కోరారు.