Site icon NTV Telugu

Tirupati laddoos: తిరుపతి లడ్డూలకు “నందిని” నెయ్యి.. జీపీఎస్, ఎలక్ట్రిక్ లాక్స్‌తో రక్షణ..

Tirupati Laddoos

Tirupati Laddoos

Tirupati laddoos: తిరుపతి లడ్డూల వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యి తక్కువ నాణ్యత కలిగి ఉండటంతో పాటు జంతువుల కొవ్వు కలిగి ఉందనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి లడ్డూల కోసం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కి చెందిన ‘‘నందిని’’ నెయ్యిని తిరిగి సరఫరా చేయడం ప్రారంభించింది. తిరుపతి దేవస్థానానికి వచ్చే నెయ్యి కోసం భద్రతా చర్యల్ని పెంచింది.

తిరుపతి దేవస్థానానికి వెళ్లే నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి, నెయ్యి కల్తీకి ఎలాంటి తావు లేకుండా చూస్తామని కర్ణాటక మిల్క్ ఫెడరేష్ వర్గాలు తెలిపాయి. ఎలక్ట్రిక్ లాకుల్ని కేవలం ఆలయ బోర్డు అధికారులు మాత్రమే తెరవగలరు. లడ్డూల నాణ్యతను మెరుగుపరచడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు ఇటీవల కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు చెందిన నందిని నెయ్యిని తిరిగి పొందడం ప్రారంభించింది.

Read Also: Noida: వెరీ లక్కీ.. కారు బైక్‌ను ఢీకొనడంతో ఎలివేటెడ్ పిల్లర్‌పై వచ్చి పడ్డ యువతి (వీడియో)

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న నందిని 2013 నుంచి తిరుపతి దేవస్థానానికి 4,000 మెట్రిక్ టన్నుల నెయ్యిని సరఫరా చేసింది. తిరుపతి లడ్డూల వివాదం వెలుగులోకి రావడంతో మరోసారి ఈ సంస్థ నుంచే నెయ్యిని తిరిగి పొందుతున్నారు. ఈ వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కూడా దేవాలయాలకు కూడా ప్రసాదం కోసం నందిని నెయ్యిని మాత్రమే వాడాలని ఆదేశించింది.

“తిరుపతి దేవస్థానం మాత్రమే కాదు, అన్ని కర్ణాటక దేవాలయాలు నందిని నెయ్యిని ఉపయోగించడం చాలా సంతోషంగా ఉంది… నెయ్యి ఉత్పత్తిని పెంచడానికి మేము సన్నాహాలు చేస్తున్నాము. మేము డిమాండ్‌ను తీర్చగలము.” అని కర్ణాటక మిల్క్ ఫెడరేన్ ఛైర్మన్ భీమా నాయక్ చెప్పారు.

Exit mobile version