NTV Telugu Site icon

MUDA land scam case: భూ కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు హైకోర్ట్ బిగ్ షాక్..

Muda Land Scam Case

Muda Land Scam Case

MUDA land scam case: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు భారీ షాక్ ఇచ్చింది కర్ణాటక హైకోర్టు. ముడా భూ కుంభకోణం కేసులో విచారణకు అనుమతి ఇచ్చిన కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసిందే. అయితే, దీనిని కోర్టు ఈ రోజు తోసిపుచ్చింది. జస్టిస్ ఎం నాగప్రసన్నతో కూడిన ధర్మాసనం..‘‘ ఈ కేసులో గవర్నర్ తన బుద్ధిని పూర్తిస్థాయిలో అన్వయించారని, అందువల్ల ముఖ్యమంత్రిపై విచారణకు స్వతంత్ర నిర్ణయం తీసుకోవచ్చు’’ అని పేర్కొంది. ‘‘గవర్నర్ చర్యలో ఎలాంటి తప్పు లేదు. వాస్తవాలపై విచారణ అవసరం. పిటిషన్ కొట్టివేయబడింది’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

Read Also: Minister Seethakka: ములుగు మున్సిపాలిటీ బిల్లుపై గవర్నర్ జిష్ణు దేవ్ తో సీతక్క భేటీ

ముఖ్యమంత్రి తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ తన ఉత్తర్వులపై రెండు వారాల పాటు స్టే విధించాలని చేసిన విజ్ఞప్తిని కూడా కోర్టు కొట్టివేసింది. తన సొంత ఉత్తర్వులపై స్టే ఇవ్వలేమని న్యాయమూర్తి తెలిపారు. అయితే, రాష్ట్ర మంత్రి వర్గం అనుమతి లేకుండా ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోలేరని సిద్ధరామయ్య వాదించారు. అక్రమంగా ఇతరత్రా భూముల మంజూరుకు సంబంధించి ముఖ్యమంత్రి ఎక్కడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సింఘ్వీ కోర్టుకు గతంలో చెప్పారు.

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ లేదా ముడా ద్వారా భూ కేటాయింపుల్లో జరిగిన అవకతవకలతో ఈ కుంభకోణం ముడిపడి ఉంది. ముఖ్యమంత్రి భార్య బీఎం పార్వతికి చెందిన భూములను సేకరించిన ముడా, అక్కడే ఆమెకు భూములు కేటాయించకుండా, నగరంలోని ప్రముఖ ప్రాంతాల్లో, ఆమె ఇచ్చిన భూమికి రెట్టింపు విలువ కలిగిన భూమిని కేటాయించారనేది అభియోగం. సిద్ధరామయ్య భార్యకు చెందిన భూమికి పరిహారంగా కేటాయించిన 14 అత్యంత విలువ కలిగిన సైట్లు అక్రమమని, ప్రభుత్వ ఖజానాకు రూ.45 కోట్ల నష్టం వాటిల్లిందని ఆర్టీఐ యాక్టివిస్టులు ఆరోపించారు. ఆగస్టు 17న ఈ వివాదంపై ముఖ్యమంత్రిపై విచారణ జరిపేందుకు గవర్నర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ సిద్ధరామయ్య వేసిన పిటిషన్‌ను అనుసరించి, హైకోర్టు ఆగస్టు 19న విచారణకు స్వీకరించింది. గవర్నర్ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తూ, దానిని రద్దు చేయాలని ముఖ్యమంత్రి కోరారు.