Site icon NTV Telugu

WFI: రెజ్లింగ్ ఫెడరేషన్ కొత్త పాలక వర్గం సస్పెండ్.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం..

Wfi

Wfi

WFI: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) కొత్త పాలక వర్గాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. డబ్ల్యూఎఫ్ఐ బాడీ ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను, నియమాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లు మంత్రిత్వ శాఖ గుర్తించిందని ఆదివారం ప్రకటించింది. జాతీయ పోటీలకు సంబంధించి చేసిన ప్రకటన తొందరపాటుతో కూడుకున్నదని, సరైన ప్రక్రియను పాటించలేదని క్రీడా మంత్రిత్వ శాఖ అధికార ప్రకటనలో తెలిపింది.

డబ్ల్యూఎఫ్ఐ కొత్త చీఫ్ గా ఇటీవల సంజయ్ సింగ్ ఎన్నికయ్యారు. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన, లైంగిక ఆరోపణ ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కి సంజయ్ సింగ్ అత్యంత సన్నిహితుడు. కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ సంజయ్ సింగ్ డిసెంబర్ 21న జూనియర్ జాతీయ పోటీలు ఈ ఏడాది చివరిలోపు ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని, రెజ్లర్ల సిద్ధం కావాలంటే కనీసం 15 రోజుల నోటీస్ అవసరమని మంత్రిత్వశాఖ పేర్కొంది.

Read Also: Ugramm: ఉగ్రమ్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్న కన్నడ సినీ అభిమానులు… ప్రభాస్ కటౌట్ కథకి సరిపోలేదట

‘‘అటువంటి నిర్ణయాలను కార్యనిర్వాహఖ కమిటీ తీసుకోవాల్సి ఉంటుంది, దీనికి ముందు అజెండాను పరిశీలనలో ఉంచాలి. డబ్ల్యూఎఫ్ఐ రాజ్యాంలోని ఆర్టికల్ 11 ప్రకారం.. ‘నోటీసులు, సమావేశాల కోరం’ కోసం 15 రోజుల ముందు తెలియజేయాలని, 1/3 మంది ప్రతినిధులు హాజరు కావాలి. అత్యవసర సమావేశానికి కూడా 7రోజుల వ్యవధితో నోటీసులు, 1/3 వంతు ప్రతినిధుల కోసం అవసరం’’ అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

అయితే ఈ వ్యవహారంపై సంజయ్ సింగ్ చట్టపరమైన పోరాటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సస్పెన్షన్ వ్యవహారాన్ని కోర్టులో సవాల్ చేయనున్నారు. ఇదే కాకుండా కేంద్ర మంత్రిత్వ శాఖ సంచలన ఆరోపణలు చేసింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న పాత పాలక వర్గం చేతిలో కొత్తగా ఎన్నికైన బాడీ ఉన్నట్లు తెలుస్తోందని చెప్పింది.

డబ్ల్యూఎఫ్ఐ వ్యవహారం వివాదాలకు కారణమవుతోంది. గతంలో మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయన సన్నిహితుడే మరోసారి అధ్యక్షుడు కావడాన్ని రెజ్లర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే రెజ్లర్ సాక్షి మాలిక్ రెజ్లింగ్‌కి గుడ్ బై చెప్పారు. బజరంగ్ పూనియాతో పాటు వీరేందర్ సింగ్ వంటి రెజ్లర్లు పద్మశ్రీని వాపస్ ఇస్తున్నట్లు ప్రకటించారు.

Exit mobile version